– వర్ధంతి సభలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు, పార్టీకి హరికృష్ణ అందించిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం దివంగత హరికృష్ణ ఆరో వర్ధంతి జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ… తెలుగు వాడి కీర్తిని చాటి చెప్పడంలో చైతన్యరథ సారథియై నిలిచారన్నారు. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా హరికృష్ణ నిలిచిపోయారని, భౌతికంగా ఆయన మనతో లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మదిలో చెరగని ముద్ర వేశాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, పార్టీ నాయకులు బుచ్చి రాంప్రసాద్, చప్పిడి రాజశేఖర్, ఏవి రమణ, నరసింహ ప్రసాద్, మురళి, వెంకటప్ప, పర్చూరి కృష్ణ, వెంకటేశ్వరరావు, పారా రామకృష్ణ, టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.