Mahanaadu-Logo-PNG-Large

నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ

గత ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డులు, పెన్షన్ లు పునరుద్ధరించండి!

అమరావతి: గత ప్రభుత్వ హయాంలో తొలగించిన పెన్షన్ లు, రేషన్ కార్డులు పునరుద్ధరించి ఆదుకోవాలంటూ ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ, శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న“ప్రజాదర్బార్ కు” విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. 15వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని.. ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అన్యాక్రాంతమైన తమ భూముల సమస్యలు పరిష్కరించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరి నుంచి విన్నపాలు స్వీకరించిన మంత్రి లోకేష్.. వాటి పరిష్కరానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

గడ్డం గ్యాంగ్ పై చర్యలు తీసుకోండి
కృష్ణా జిల్లా గుడివాడలో గడ్డం గ్యాంగ్ ఆగడాలకు తీవ్రంగా నష్టపోయానని, సదరు గ్యాంగ్ పై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ముసునూరి హరికృష్ణ మంత్రి లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థలో ఎమ్ఎస్ వో గా, ఆపరేటర్ గా పనిచేస్తున్నాను. 2017లో ఏపీ టిడ్కో గృహాలకు ఫైబర్ నెట్ ప్రసారాలు అందించాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రూ.50 లక్షల వ్యయంతో వైరింగ్, సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రసారాలు అందించాను.

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అప్పటి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అండతో గడ్డం గ్యాంగ్ రంగంలోకి దిగి ఫైబర్ నెట్ సిగ్నల్ వ్యవస్థకు విద్యుత్ ప్రసారం కాకుండా అడ్డుకున్నారు. నన్ను తీవ్రంగా వేధించారు. వైర్లను ధ్వంసం చేసి నష్టపరిచారు. గడ్డం గ్యాంగ్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని, వారి నుంచి రక్షణ కల్పించాలని హరికృష్ణ కోరారు. సదరు విజ్ఞప్తిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు.

పెన్షన్ లు, రేషన్ కార్డులు పునరుద్ధరించండి
క్యాన్సర్ తో బాధపడుతున్న తనకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరి మండలం నవులూరుకు చెందిన పుల్లకూర అరుణ లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా రేషన్ కార్డు, పెన్షన్ మంజూరు చేయలేదని, ప్రజా ప్రభుత్వంలో వాటిని మంజూరు చేయాలని నవులూరుకు చెందిన ఏఎస్ భ్రమరాంబ కోరారు.

గత ప్రభుత్వం తొలగించిన వృద్ధాప్య పెన్షన్ పునరుద్ధరించాలని ఉండవల్లికి చెందిన బత్తుల కృష్ణ విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుడైన తన కుమారుడికి పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన బి.రంగారావు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె మంచానికి పరిమితమైందని, ఎలాంటి ఆధారం లేదని, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన తోకల బాలాజి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన రేషన్ కార్డు, వితంతు పెన్షన్ పునరుద్ధరించాలని మంగళగిరి కుప్పురావు కాలనీకి చెందిన జి.వెంకట లక్ష్మీ కోరారు. డిగ్రీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఉండవల్లికి చెందిన పి.అభికేష్ విజ్ఞప్తి చేశారు.

ఎలాంటి ఆధారం లేని తనకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన సీహెచ్.పల్లవి కోరారు. తన 75 సెంట్ల భూమిని కబ్జా చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, కబ్జాదారులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని గుంటూరు జిల్లా తెనాలి మండలం, కొలకలూరుకు చెందిన ముసునూరు నాగేశ్వరరావు కోరారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ వద్ద మూడు దశాబ్దాలుగా నివసిస్తున్న తమకు దారి సమస్య ఉందని, పరిష్కరించాలని ఏపీఎస్పీ విశ్రాంత ఉద్యోగులు లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. స్టేట్ పోలీస్ అసోసియేషన్ ఎలక్షన్ కాలపరిమితి ముగిసినందున తిరిగి ఎన్నికలు నిర్వహించాలని మంగళగిరి 6వ బెటాలియన్ సిబ్బంది కోరారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బి-ఫార్మసీ అభ్యర్థులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, తిరిగి ఉద్యోగాలు ఇప్పించాలని బీ-ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు కోరారు. సీపీఎస్ విధానం అమలు తేదీ కంటే ముందే నియామకపత్రాలు పొందిన తమకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని 2003 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుళ్లు విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.