Mahanaadu-Logo-PNG-Large

హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి

-స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులకు నివాళులర్పించాలి
-జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య తెలుగువారు కావడం గర్వకారణం
-ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని రేపు 100 అన్న క్యాంటీన్లు ప్రారంభం
-గ్రామస్థాయి కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు

అమరావతి: హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఇంటింటా జాతీయ జెండా ఎగరాలి. రేపు 78వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 2047 నాటికి వందేళ్ల ఉత్సవాలను జరుపుకుంటాం. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్, విజన్-2047 లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. రేపు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేసి యువత, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలి. సమరయోధులకు నివాళులర్పించాలి. దేశాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు సమానమన్న అభిప్రాయాన్ని తీసుకురావాలి.

జాతీయ జెండాను రూపకర్త మన తెలుగువారైన పింగళి వెంకయ్య. ఇది తెలుగుజాతికి గర్వకారణం. దేశానికి స్వాతంత్ర్యం అనంతరం అంచలంచలుగా దేశాన్ని నాయకులు అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు…దాన్ని కొనసాగించడంతోపాటు మరింత ముందుకు తీసుకెళ్లాలి. జాతీయ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఇనుమడించాలి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపే అన్నక్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన హమీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు ముందడుగు వేశాం.

దేశంలోనే మొదటి సారిగా నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం. ప్రజలకు ఉచిత ఇసుకను కూడా అందిస్తున్నాం. గత ప్రభుత్వ ఇసుక, మద్యంలో దోచేసింది. ఇసుక పాలసీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఉచితంగానే ఇసుకను అందిస్తున్నా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. నది నుండి ఇసుక తీయడానికి, సీనరేజ్, రవాణాకు మాత్రమే లబ్ధిదారులు చెల్లించాలి…ఇసుకకు రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. అన్ని సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే సదుపాయం త్వరలో కల్పిస్తాం. ఆన్ లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తాం. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతాం.

ఇప్పటికి 60 రోజుల పాలన పూర్తయ్యింది. రాష్ట్రం అన్ని రకాల సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. వాటి పరిష్కారంపై ఎక్కువ దృష్టి పెట్టాం. ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, ప్రజల నుండి వినతలు స్వీకరిస్తున్నా. పార్టీ కోసం త్యాగాలు చేసినవారందరినీ ఆదుకునేందుకు నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తాం. మెరిట్ ప్రకారం నామినేటెడ్ పోస్టులు కూడా త్వరలో ఇస్తాం…ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.

జనసేన, బీజేపీలతో కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కూడా సహకరిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వాళ్లు 11 సీట్లకు పరిమితం అయ్యారంటే ఏ విధంగా పరిపాలించారో అర్థం చేసుకోవచ్చు. అందుకే మనం 1995 మోడల్ పరిపాలనను గుర్తు చేసుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నాయకులు, కార్యకర్తలు ఆర్థికంగా బాగా నష్టపోయారు. గత ఐదేళ్లు నేను కూడా ఇబ్బందులు పడ్డాను.

పార్టీ కోసం కార్యకర్తలు, నేతలు ఎన్నో త్యాగాలు చేశారు. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మనం మళ్లీ గెలవాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి. తిరిగి కోలుకోలేని పరిస్థితిలోకి వైసీపీ వెళ్లింది. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొని అధికారంలోకి వచ్చాం. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్రాభివృద్ధికి కోసం వినియోగిద్దాం. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పరిపాలన సాగుతోంది. గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేయాలనే బలమైన సంకల్పంతో ఉన్నాం.

అధికారంలో ఉన్నాం కదా అని తప్పులు చేయకూడదు. పొలిటికల్ గవర్నెన్స్ ను దుర్వినియోగం చేస్తే ప్రజలు ఇష్టపడరు… మనం ప్రజల కోసం పనిచేయాలి. మనం చేసిన మంచి పనులే మనతో ఉంటాయి. కంటిన్యూగా అధికారంలో ఉండి అభివృద్ధి చేసుకుని రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలబెట్టుకోవచ్చు. సుపరిపాలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.