– ఔత్సాహిక రైతుకు డీఆర్‌డీఏ ద్వారా ఆర్థిక సహకారం
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ద్వారా చెక్కు పంపిణీ
అమరావతి: ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛమైన ఉత్పత్తులు అందించడంతో పాటు పర్యావరణానికీ కొండంత మేలు చేసే ప్రకృతి సేద్యం దిశగా కదిలి, తమ ఆలోచలను ఆచరణలో పెట్టి పదిమందికీ ఆదర్శంగా నిలుస్తున్న రైతులకు అవసరమైన సహాయసహకారాలు అందించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అన్నారు.
నాన్ పెస్టిసైడ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌పీఎం) దుకాణం ఏర్పాటు ద్వారా కషాయాలు, విత్తనాలు, లింగాకర్షక బుట్టలు వంటివాటిని ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అందించేందుకు జి.కొండూరు మండలం, చెవుటూరు గ్రామానికి చెందిన కంభంపాటి రమాదేవికి డీఆర్‌డీఏ ఆర్థిక సహకారం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును శుక్రవారం కలెక్టర్ డా. జి.సృజన.. జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావుతో కలిసి అందించడం జరిగింది.
ఇటీవల కలెక్టర్ సృజన జి.కొండూరు మండలం, చెవుటూరు గ్రామంలో పర్యటించారు. గ్రామ పరిధిలోని రైతులు అనుసరిస్తున్న జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ (జెడ్‌బీఎన్ఎఫ్) విధానాలను పరిశీలించారు. నేలకు.. ఆపై పంటకు స్వచ్ఛమైన సత్తువనిచ్చే జీవామృతం తయారీ విధానంతో పాటు వివిధ రకాల కషాయాల తయారీ, వినియోగించే విధానాలను పరిశీలించారు.
కొన్నేళ్లుగా ఈ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు, కౌలు రైతులు ప్రకృతి సేద్యాన్ని ఆచరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా జీవామృతం, వివిధ కషాయాలను ఉపయోగించి చేసే సాగుతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
అయితే ఈ సేద్యానికి అవసరమయ్యే కషాయాలు వంటివి తయారుచేసుకోలేని వారికి వీలుగా డీఆర్‌డీఏ వంటి శాఖల ద్వారా ఔత్సాహిక రైతులతో దుకాణాల ద్వారా విక్రయానికి చొరవ చూపనున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం స్వయం సహాయక సంఘ సభ్యురాలు కంభంపాటి రమాదేవికి సహాయమందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.