– జగద్గురు శ్రీ విధుశేఖరభారతీ మహాస్వామి
శృంగేరీ: ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఉదయం శృంగేరీ చేరుకొన్నారు. మొట్టమొదట శృంగేరీలో కొలువై ఉన్న శ్రీ శారదా అమ్మవారి దేవాలయాన్ని, ఇతర దేవతా సన్నిధులను దర్శించుకుని నరసింహవనంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్న ఉభయ జగద్గురువులను దర్శించుకున్నారు. తొలుత జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారిని దర్శించుకుని వారి ఆశీస్సులు పొందారు. అనంతరం జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖరభారతీ మహాస్వామి వారి దర్శనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటగా దక్షిణామ్నాయ శ్రీ శృంగేరీ శారదాపీఠాన్ని సందర్శించి, రాష్ట్ర పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలకు జగద్గురువుల మార్గదర్శకాలను, ఆశీరనుగ్రహాన్ని పొందటానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రార్థనాసందేశాన్ని కూడా విన్నవించటానికి తాము వచ్చినట్టు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వామివారికి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఆశీస్సులు, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉంటాయని, ధర్మ బద్ధంగా ప్రజలకు మేలు కలిగేలా ఉత్తమ పాలన అందించటానికి ప్రభుత్వం కృషి చేయాలని శ్రీ స్వామివారు ఆశీర్వదించారు. 2018వ సంవత్సరం మార్చి నెలలో తమ ఆంధ్రప్రదేశ్ విజయయాత్రలో భాగంగా విజయవాడలో ఉన్నప్పుడు అప్పుడు కుడా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తమను సందర్శించికున్నట్టు, తరువాత ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో తాము కుడా సందర్శించి ఆశీర్వదించినట్టు శ్రీ విధుశేఖరభారతీ మహాస్వామి వారు గుర్తు చేసుకున్నారు.