విధుల్లో నిర్లక్ష్యం..

-ఏపీలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటుకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు ప‌డింది. ఈ మేరకు ఏపీ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పి. శ్రీలేఖపై బదిలీ వేటు పడింది. కర్నూల్ డిప్యూటీ కలెక్టర్ ఏ.మురళి, అనంతపూర్ డిప్యూటీ కలెక్టర్ రాంభూపాల్ రెడ్డిలు కూడా ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో బదిలీ వేటు పడింది. వీరిని బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు అధికారులు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు తదుపరి ఉత్తర్వులకోసం రిపోర్ట్ చేయాలని సీఎస్ ఉత్తర్వుల్లో ఆదేశించారు.


ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటుకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. వీరు ఆయా స్ధానాల్లో ఆర్వోలుగా ఎంసీసీ పూర్తయ్యే వరకూ వ్యవహరించనున్నట్టు సమాచారం. డిప్యూటీ కలెక్టర్లుగా నియామకమైన వారిలో ఎం. వెంకట సత్యనారాయణ, సి. విశ్వనాధ్, జె. శిరీషలు ఉన్నారు.

ఎం వెంకట సత్యనారాయణను మార్కాపూర్ ఆర్ అండ్ ఆర్ యూనిట్ కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ చేయగా.. సి విశ్వనాధ్ ను కర్నూల్ హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్ త్రీకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ చేశారు. జే .శిరీషను అనంతపురం పిఏబిఆర్ 2కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు