ఏపీలో కొత్తగా నాలుగు లేన్ల హైవే..

– కేంద్రం గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహకారం మెండుగా ఉంది. నిధుల కేటాయింపు దగ్గర నుంచి కొత్త ప్రాజెక్టుల వరకూ అన్నింటిలోనూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం దక్కుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో శుభవార్త అందింది.

విశాఖపట్నం- అరకు మార్గంలో నాలుగు లైన్ల రహదారికి కేంద్రం పచ్చజెండా ఊపింది. విశాఖ- అరకు రూట్లో పెందుర్తి – బౌడరా మధ్య ఎన్‌హెచ్‌-516బి విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. పెందుర్తి నుంచి కొత్తవలస, శృంగవరపుకోట మీదుగా బౌడరా వరకూ ఈ రోడ్డు ఉంది. అయితే ఈ రోడ్డును నాలుగు లైన్లకు విస్తరించాలని గతంలోనే ప్రతిపాదనలు వెళ్లాయి. భారతమాల పరియోజన కింద అనుమతులు కూడా మంజూరయ్యాయి. అయితే టెండరు ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. రహదారుల విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.