న్యూఢిల్లీ: విశాఖ రైల్వే జోన్ అంశానికి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. విశాఖ రైల్వే జోన్ కోసం కొత్తగా భూమి అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. భూమి విషయమై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రస్తావించినట్టు సమాచారం. విశాఖ రైల్వే జోన్ అంశమై ఏపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని చెప్పారు. ఈ విషయమై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా తనతో ఎప్పుటికప్పుడు మాట్లాడుతున్నారని రైల్వే మంత్రి తెలిపారు.
విశాఖ రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటు కోసం గతంలో ప్రభుత్వం కేటాయించిన స్థలం వరద నీరు నిలిచే ప్రాంతమని వేరే భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు వెల్లడించారు. ప్రభుత్వం కొత్తగా భూమి కేటాయించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం అడిగిన 52 ఎకరాల భూమిని సమకూర్చడంలో ఆలస్యమైంది. దీంతో రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటులో జాప్యం జరుగుతూ వస్తోంది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉండటంతో రైల్వే జోన్ ఏర్పాటు పనులు పుంజుకుంటాయని ఉత్తరాంధ్ర వాసులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం రైల్వే జోన్ కోసం కొత్తగా భూమిని కేటాయించనుందని తెలియడంతో ఆసక్తి నెలకొంది.