గాంధీపై మోదీ వ్యాఖ్యలకు నిరంజన్‌రెడ్డి స్పందన

ప్రధాని ఒక అజ్ఞాని..తనకు తెలిసిందే ప్రపంచమంటారు
కొత్తగా గాంధీని పరిచయం చేస్తున్నారని వ్యాఖ్యలు

హైదరాబాద్‌: గాంధీ సినిమా 1982లో వచ్చేంత వరకు మహాత్మాగాంధీ ప్రపంచానికి తెలియదు అన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించారు. మహాత్ముడిని కొత్తగా ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తమకు తెలిసిందే ప్రపంచం అన్న సంకుచితులు, అజ్ఞానులు ఈ రోజు దేశానికి మార్గదర్శకులని మండిపడ్డారు.

ఐన్‌స్టీన్‌, చర్చిల్‌ మాటలు చరిత్రలో ఉన్నాయి

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త అల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌ ఒక సందర్భంలో మహాత్మా గాంధీ గురించి ప్రస్తావిస్తూ ‘‘కొన్నేళ్ల తర్వాత భావితరాలు.. ఈ నేల మీద రక్తమాంసాలు కలిగిన మహాత్మాగాంధీ లాంటి ఒక మనిషి నడ యాడిరడు అంటే నమ్మశక్యం కాకుండా ఉంటుందేమో’’ అని మహాత్మాగాంధీకి ఉన్న అసాధారణ గొప్ప లక్షణాల గురించి చెప్పాడు. భారత స్వాతంత్య్రం అనంతరం నాటి బ్రిటన్‌ ప్రధాని విన్‌ స్టన్‌ చర్చిల్‌ ‘‘తమ రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌ పాత్ర..జరిగిన లాభనష్టాలు. వారి సామ్రాజ్యవాద పరిపాలన’’ తదితర అంశాల మీద బ్రిటన్‌ క్యాబినెట్‌ చర్చిస్తున్న సందర్భంలో ‘‘అహింసావాదం అనేది, సత్యాగ్రహం అనేది, సహాయనిరాకరణ అనేది మహాత్మాగాంధీ కొత్తగా పరిచయం చేసిన పోరాట రూపాలను, సిద్ధాంతాన్ని మేము చులకనగా చూశాం… తక్కువ అంచనా వేశాం. ఈ సిద్ధాంతం వెనక, ఈ ప్రక్రియలకు ఇంత గొప్ప ప్రజాశక్తి ఉందని గ్రహించి ఉంటే.. మాకు అర్థం అయి ఉంటే.. మేమే మహాత్ముడిని భౌతికంగా నిర్మూలించే వాళ్లం‘‘ అని చర్చిల్‌ అన్నారు. ఐన్‌ స్టీన్‌ విన్‌స్టన్‌ చర్చిల్‌ మాటలు చరిత్ర రికార్డుల లో ఉన్న విషయం ప్రపంచానికి తెలుసు.

గాంధీ మార్గదర్శకుడని మండేలా చెప్పారు

దక్షిణాఫ్రికా నల్లజాతీయుడు.. 27 ఏళ్లు కారాగార జీవితం అనుభవించిన నెల్సన్‌ మండేలా స్వయంగా ‘‘మేము హింసను వీడి మహాత్మాగాంధీ మార్గం అనుసరిం చాం కాబట్టి దక్షిణాఫ్రికాకు స్వాతంత్య్రం సముపార్జించాం. ఆయనే మాకు మార్గదర్శి’’ అని అన్నారు. అమెరికా అధినేతగా ఉన్న బరాక్‌ ఒబామా భారత పర్యటనకు వచ్చినప్పుడు ‘‘మహాత్మాగాంధీ తమకు స్ఫూర్తి’’ అని ప్రకటించారు. ఇదంతా కళ్ల ముందు ఉన్న చరిత్ర. కానీ, అత్యంత దురదృష్ణం, విషాదం ఏమంటే అలాంటి మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సే ఇవాళ ఆరాధ్యుడు అవుతున్నాడని వ్యాఖ్యానించారు.