– కడప జిల్లాలోని కాశీనాయన క్షేత్రం అభివృద్ధికి ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి అంగీకారం
– అవిభక్త అనంతపురం జిల్లాలో మైనారిటీల అభివృద్ధికి ప్రతిపాదనల్ని పంపించమన్న కేంద్రం
– రాష్ట్రానికి రానున్న నీతి అయోగ్ సభ్యుడు, కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి
– ఫలించిన మంత్రి సత్యకుమార్ చర్చలు
అమరావతి: రాష్ట్రంలో రెండు, మూడు దశల్లో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను అవసరాల మేరకు అందించడానికి నీతి అయోగ్ సానుకూలంగా స్పందించింది. ఈ విషయంలో రాష్ట్ర వైద్య ,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం నాడు ఢిల్లీలో నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ కె.వినోద్ పాల్‌తో చర్చలు జరపగా ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతిపాదనల్ని సానుకూలంగా పరిశీలిస్తామని డాక్టర్ పాల్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రులను మరింత పటిష్టం చేయడానికి మంత్రి సాయం కోరగా, నీతి అయోగ్ సభ్యుడు సానుకూలమైన హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో రెండు, మూడు దశల్లో 12 కొత్త వైద్య విద్యా కళాశాలలు నిర్మించాల్సి ఉండగా, అందులో పాడేరు, పిడుగురాళ్ల కళాశాలల నిర్మాణం కేంద్రం సాయంతో జరుగుతోంది. కొత్త వైద్య కళాశాలలను ఒక్కోదానిని దాదాపు రూ. 500 కోట్ల ఖర్చుతో నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ ఖర్చుతో పాటు ఒక్కో కళాశాల నిర్వహణకు ఏడాదికి దాదాపు రూ. 200 కోట్ల ఖర్చవుతుందని అంచనా.
మొత్తం 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటును 2021లో ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన గత రాష్ట్ర ప్రభుత్వం, వాటి నిర్మాణంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం వహించింది. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధుల్ని కూడా సరిగా విడుదల చేయకుండా కేంద్రంతో పాటు నాబార్డు ఇచ్చిన నిధుల్ని కూడా పెద్ద మొత్తంలో గత ప్రభుత్వం దారిమళ్లించడంతో ఈ కళాశాలల నిర్మాణంలో భారీగా ఆలస్యం జరిగింది.
ఈ నేపథ్యంలో అన్య మార్గాల ద్వారా కొత్త కళాశాలల నిర్మాణాన్ని చేపట్టాలని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. సుదూర, జిల్లా స్థాయిలో ఈ కళాశాలల నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉన్నందున కేంద్రం నుంచి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం మంత్రి సత్యకుమార్ యాదవ్ నీతి అయోగ్‌తో చర్చించారు.
దీంతో పాటు రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రులలో క్రిటికల్ కేర్ బ్లాకుల్ని అభివృద్ధి చేయడానికి అవసరమయ్యే సాయంపై కూడా మంత్రి చర్చించారు. ప్రమాదాలు, ట్రామా కేర్ కేసులు ఎక్కువ అవుతున్నందున ఈ సేవల్ని పటిష్టం చేయాల్సి ఉందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో 15 యాస్పిరేషనల్ బ్లాకుల్లో వివిధ రంగాల అభివృద్ధికి కేంద్రం సాయం అందిస్తుంది.
ఇందులో భాగంగా ఆయా బ్లాకుల్లో వైద్య సేవల అభివృద్ధికి కేంద్రం సాయంపై కూడా మంత్రి చర్చించారు. అవిభక్త అనంతపురం జిల్లాలో స్థానిక పరిస్థితుల దృష్ట్యా మరికొన్ని అదనపు బ్లాకులను యాస్పిరేషన్ బ్లాకులుగా గుర్తించాలని మంత్రి నీతి అయోగ్ ను కోరారు. గంట సేపు సాగిన ఈ చర్చల సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ వినోద్ పాల్ ను రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించగా, అందుకు ఆయన అంగీకరించారు.
జాతీయ జల్ జీవన్ మిషన్ అమలును అవిభక్త అనంతపురం జిల్లాలోని సాగు నీటి పారుదల పథకాల అమలుతో అనుసంధానం చేసి సాగునీటి సమస్య పరిష్కారినికి దోహదం చేయాలని మంత్రి కోరగా, ఈ విషయాన్ని సంబంధిత అధికారులతో చర్చిస్తామని నీతి అయోగ్ సభ్యలు హామీ ఇచ్చారు.
రాయలసీమ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన కడప జిల్లాలోని శ్రీ కాశీనాయన ఆశ్రమం మరియు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి అటవీ శాఖా పరంగా ఎదురవుతున్న సమస్యల్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖా మంత్రి భూపేంద్ర యాదవ్‌తో చర్చించి సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు.
అటవీ పరిరక్షణ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్షేత్ర నిర్వాహకులు అటవీ భూమి అవసరాలను మొదట ఆశించిన దానికంటే భారీగా తగ్గించి దాదాపు 6 హెక్టార్ల అటవీ భూమి అవసరమవుతుందని ప్రతిపాదనల్ని పంపారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. దీనిని స్వాగతిస్తూ స్థానిక పర్యావరణ పరిస్థితులకు ఎటువంటి ఆటంకం కలగకుండా మధ్యే మార్గంగా పరిష్కారాన్ని కనుగొనగడానికి తమ శాఖ దోహదపడుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం శాసన సభ నియోగకవర్గంలో మైనారిటీ ముస్లింల అభివృద్ధికి సాయం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర మైనారిటీల సంక్షేమ శాఖా మంత్రి జార్జ్ కురియన్‌ను బుధవారం నాడు కోరారు. ముస్లిం మైనారిటీల ప్రయోజనం కోసం సద్భావనా భవన్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, పశు పాలన, మత్స్యకారులకు కేంద్రం సాయం అందిస్తుంది.
ఆయా విషయాలకు సంబంధించి ధర్మవరంతో పాటు ఇతర సమీప ప్రాంతాల మైనారిటీల ప్రయోజనం కోసం తగు కేంద్ర సాయాన్ని అందించాలని మంత్రి కేంద్రాన్ని కోరారు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదలను పరిశీలించి తగు సాయాన్ని అందించాలని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయి పరిశీలకు రాష్ట్రానికి రావాల్సిందిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరగా, కేంద్రమంత్రి అంగీకరించారు.