అంతా ‘అనుముల ఇంటెలిజెన్స్’ మహిమ!
– కాంగ్రెస్ పార్టీ ట్విట్‌పై మండిపడ్డ కేటీఆర్
హైదరాబాద్, మహానాడు: తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్టు జాతీయ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ పై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ చేసినట్టు ఇచ్చిన ప్రకటనలో ఏ విధంగా అయితే అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) రూపొందించిన చిత్రాన్ని వాడారో… రుణమాఫీ జరిగిన రైతుల లెక్క విషయంలో కూడా మీ ముఖ్యమంత్రి ఏఐ టెక్నిక్ వాడారంటూ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న 40 లక్షల మంది రైతులు అనే సంఖ్య అనుముల ఇంటెలిజెన్స్ అంటే రేవంత్ రెడ్డి వాడిన అబద్దాల ఏఐ టెక్నిక్ తో రూపొందించిందేనని ఎద్దేవా చేశారు.
నిజానికి తెలంగాణలో ఇప్పటి వరకు రైతు రుణాలు 40 శాతం కూడా మాఫీ కాలేదని చెప్పారు. కానీ తరుచూ నిబంధనలు మారుస్తూ రుణమాఫీ తేదీలు మారుస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామంలోనూ, నియోజకవర్గంలోనూ కూడా రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. రుణమాఫీ విషయంలో నిబంధనలు, తేదీలు మారుతున్నప్పటికీ…ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అబద్ధాలు, బూటకపు ప్రచారాలు మాత్రమే నిత్యం ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.