ఇకపై దోపిడీ కుదరదు!

ప్రతి పని పారదర్శకంగా జరగాల్సిందే
జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష
– సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 

సర్వేపల్లి, మహానాడు:  ఇకపై దోపిడీ కుదరదు..ప్రతి పని పారదర్శకంగా జరగాల్సిందే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఐదు మండలాల నుంచి అధికారులు హాజరయ్యారు. మండలాల వారీగా ఉపాధి పనులపై ఆరా తీశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.49.51 కోట్లతో పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటికే రూ.8.13 కోట్ల విలువైన పనులు చేసినట్లు అధికారులు వివరించారు. మిగిలిన సుమారు రూ.41.5 కోట్లతో రైతులు, రైతు కూలీలకు, ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి సూచించారు. పనులపై పర్యవేక్షణ ఉండాలని నాయకులకు సూచించారు.

రోడ్లకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేపట్టడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు ఇంకా బిల్లులు చెల్లించకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల అభివృద్ధి పేరిట చేసిన అక్రమాలను సమావేశం దృష్టికి తేవడంతో పాటు విజిలెన్స్ విచారణకు పలు గ్రామాల నాయకులు డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించారు.

మొన్నటి వరకు పనులు చేయకుండానే బిల్లులు చేసుకోవడంతో పాటు, ఐదేళ్లుగా సామాజిక తనిఖీలు నిర్వహించకుండానే చేసినట్లు రికార్డుల్లో నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి పని పారదర్శకంగా, నాణ్యతతో జరగాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యవసాయ పనులకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసేలా చూడాలని నాయకులు కోరారు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.