ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ ఒక్క సీటు చేజారకూడదు

గెలుపే లక్ష్యంగా నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలి
అభ్యర్థులతో ప్రత్యేక సమీక్షల్లో చంద్రబాబు బిజీ బిజీ
అసంతృప్తులకు బుజ్జగింపులు…ముఖ్యనేతలకు దిశానిర్దేశం
ఆ ఇద్దరు నేతలకు క్లాస్‌ పీకిన అధినేత

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, మహానాడు న్యూస్‌: సత్తెనపల్లి పర్యటనలో భాగంగా ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గల వారీగా గెలుపున కు అవరోధంగా ఉండే ఏ ఒక్క అంశాన్ని విస్మరించకుండా అన్ని అడ్డంకులు అధిగమించేం దుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేతలందరికీ దిశా నిర్దేశం చేశారు. టీడీపీ నేతల మధ్య అంతర్గత విభేదాలు, కూటమి పార్టీల నేతల మధ్య ఎలాంటి కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వంటివి ఉండకూడదని నియోజకవర్గాల వారీగా నేతలను పిలిపించి వారితో విడివిడిగా మాట్లాడారు. పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. ముందు గా నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు, అక్కడి ముఖ్యనేతలు, అలాగే అసంతృప్త నేతలతో మాట్లాడి బుజ్జగింపులు, హామీలు ఇవ్వడం వంటి కార్యక్రమాలతో అధినేత చంద్రబాబు బిజీబిజీగా గడిపారు.

నరస రావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు, నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు, మాచర్ల నేత జూలకంటి బ్రహ్మారెడ్డి, సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ తదితర ముఖ్య నేతలు అందరితో చంద్రబాబు చర్చించారు. ముఖ్యంగా నరసరావుపేటలో తిరిగి తెలుగుదేశం జెండా ఎగరవేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని మరీమరీ కోరారు. నరసరావుపేట అభ్యర్థి డాక్టర్‌ చదరవాడ అరవిందబాబు, టీడీపీ ముఖ్య నేత నల్లపాటి రాముతో పాటు మరికొంతమంది ముఖ్యనేతలతో మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. అదేవిధంగా గురజాల నియోజకవర్గంలోని యరప తినేని శ్రీనివాసరావు ఇతర నేతలతో కూడా చర్చించారు. అలాగే సత్తెనపల్లి, నరసరావుపేట ల్లో పార్టీని గెలిపించాలని, అందుకు డాక్టర్‌ కోడెల శివరాం ముందుండి పనిచేయాలని చంద్రబాబు ప్రత్యేకంగా పిలిచి మాట్లాడారు. అధికారం వచ్చిన తర్వాత మీకు అండగా ఉంటామని, పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అలాగే నాగోతు శౌరయ్య, బాజీ చౌదరిలు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. పెదకూర పాడులో టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌, మాజీ ఎమ్మెల్యే సీనియర్‌ నేత కొమ్మాలపాటి శ్రీధర్‌ కలిసి పనిచేసి గెలిచి రావాలని కోరారు. ఇక్కడ పార్టీ గెలుపునకు ఖచ్చితంగా కృషి చేస్తారనే నమ్మకంతోనని కొమ్మాలపాటి శ్రీధర్‌కు ముందే ఎమ్మెల్సీ హామీ ఇచ్చి పార్టీ గౌరవిం చింది అని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. అదేవిధంగా పెదకూరపాడు, వినుకొండ, మాచర్ల నియోజకవర్గాలలో గెలుపునకు ఆటంకమని భావించే లోపాలను, సర్వేల్లో వస్తున్న రిపోర్టులను నాయకులకు వివరించి వాటన్నింటినీ అధిగమించి గెలుపు దిశగా అందరూ పని చేయాలని ఆయా నేతలకు దిశానిర్దేశం చేశారు.

`గుంటూరు పార్లమెంటు పరిధిలో అన్నింటా గెలవాలి

అదేవిధంగా గుంటూరు పార్లమెంట్‌ పరిధిలోని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు గల్లా మాధవి, నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్‌ కుమార్‌, రామాంజనేయులు, నజీర్‌ అహ్మద్‌తో పాటు ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతలతోనూ సమీక్షించారు. పార్లమెంట్‌ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లు గెలుచుకోవాలని, అలాగే ఎంపీ అభ్యర్థి పెమ్మసాని రెండు లక్షల పైగా ఆధిక్యతతో గెలుపొందేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నేతలను కోరారు. ఇలా నరసరావుపేట గుంటూరు పార్లమెంటు పరిధిలోని నేతలందరితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిజీ బిజీగా ఎన్నికల వర్క్‌ షాప్‌ నిర్వహించారు. వీరితో పాటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.

`చంద్రబాబును కలిసిన సుజనా చౌదరి, మందకృష్ణమాదిగ

అయితే విజయవాడ పశ్చిమ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ సుజనా చౌదరి సత్తెనపల్లిలో చంద్రబాబును కలిసేందుకు రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆదివారం చంద్రబాబు ప్రజాగళం కృష్ణా జిల్లాలో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆ పర్యటన వివరాలు చర్చించేందుకు చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలిసింది. మరోవైపు దివ్యాంగు ల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఇదే అంశంపై పోరాటం చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలసి చంద్రబాబుతో సమావేశమయ్యారు. దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్‌ ఇవ్వడం వంటి గట్టి హామీలను పొందారు. ఇలా నేతలందరితో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అవుతూనే మధ్యలో తనను కలిసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలకు అభివాదం చేస్తూ కనిపించారు.

` ఆ ఇద్దరు అభ్యర్థులకు ప్రత్యేక క్లాస్‌

గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్‌ అహ్మద్‌, పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవికి వారి తీరుపై చంద్రబాబు ప్రత్యేకంగా క్లాస్‌ తీసుకున్నట్లు తెలిసింది. ఎంతో మంది ఆశావాహుల ఒత్తిడుల నడుమ నజీర్‌ అహ్మద్‌కు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మళ్లీ టికెట్‌ కేటాయించడం జరిగిందని, అలాగే గళ్లా మాధవికి ఎంతో దిగ్గజ నేతల నుంచి టికెట్‌ కోసం తీవ్ర ఒత్తిడులు వచ్చినా సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్‌ కేటాయించడం జరిగిందని…కారణాలేమైనా వీరిరువురు సొంత పార్టీ నేతలతో పాటు కూటమికి చెందిన ఇతర ముఖ్య నేతలను కలుపుకు వెళ్లడంలో వెనుకబడుతున్నట్లు తెలుస్తుందని, అలాగే కార్పోరేటర్లతో ఇంతవరకు సమావేశమై దిశానిర్దేశం చేసుకోకపోవడం ఏమిటని గట్టిగా క్లాస్‌ తీసుకున్నట్లు సమాచారం.