పంచ న్యాయాలు కాదు…పంగ నామాలు

గ్యారంటీల పేరుతో రాహుల్‌ మభ్యపెడుతున్నారు
తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోరు
బీసీలకు బద్ధ శత్రువు కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలి
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌

హైదరాబాద్‌, మహానాడు: పంచ న్యాయాల పేరుతో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి మోసగించేందుకు ముందుకు వచ్చిందని  ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఓబీసీ మోర్చా తెలంగాణ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుక్కుగూడ సభలో కాంగ్రెస్‌ పంచ న్యాయాల పేరుతో ప్రజలను వంచించడాని కి పంగనామాలు పెట్టడానికి తెరలేపారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇస్తామన్న రూ.2500లకే దిక్కులేదు..కానీ, దేశ వ్యాప్తంగా మహిళలకు లక్ష ఇస్తామని ప్రకటించడం పచ్చి మోసంగా అభివర్ణించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను కాం గ్రెస్‌ మోసం చేసింది..ఆరు గ్యారం టీలకు దిక్కు లేదు కానీ, మరోసారి గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని వాటిని తెలంగాణ ప్రజలు మరోసారి నమ్మి మోసపోరని అన్నారు.

తుక్కుగూడలో జనజాతర సభ ఫ్లాప్‌

కాంగ్రెస్‌ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వళ్లించినట్లుంది.. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో కాంగ్రెస్‌ పార్టీలో సామాజిక న్యాయం కూడా అంతే ఉంటుంది…అంబేద్కర్‌ను ఓడిరచడానికి కుట్ర పన్నిన కాంగ్రెస్‌ ఇప్పుడు అంబేద్కర్‌ పేరు వాడుకుంటోందన్నారు. కనీసం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్‌ ఫొటో కూడా ఉండదని విమర్శించారు. ఓబీసీకి చెందిన రైతు నాయకుడు చరణ్‌ సింగ్‌కు మోదీ ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించింది..కాంగ్రెస్‌ పీవీ నరసింహారావును అవమానిస్తే తాము భారత రత్న ఇచ్చి గౌరవించాం..ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మోదీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వారి గౌరవాన్ని పెంచింది..కానీ, బీసీలను కించపరిచే విధంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతున్నా డు..చాయ్‌ అమ్మిన ఒక వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రధానిగా ఉంటే కాంగ్రెస్‌ ఓర్చుకోవటం లేదు…ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేయడానికి ముందుకు వస్తే కాంగ్రెస్‌ ఓడిరచడానికి చూసింది..బీసీలకు బద్ధ శత్రువు కాంగ్రెస్‌ పార్టీ..బీసీలందరూ కలిసి మరోసారి మోదీని గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.