భూమిని ఆక్రమించి, హత్యాయత్నం!

– బీజేపీ వారధికి ఫిర్యాదుల వెల్లువ

విజయవాడ, మహానాడు: భూమిని ఆక్రమించి నన్ను హతమార్చే ప్రయత్నం చేశారంటూ బి.నాగరాజు వారధిలో ఫిర్యాదు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో వారిధి కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నాటి కార్యక్రమానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. రాజంపేట జిల్లా మదనపల్లి మండలం కొత్తవారి పల్లె గ్రామంలో బి.నాగరాజు కు చెందిన భూమిని వై యస్ ఆర్ పార్టీ కి చెందిన బి.చిన్నప్ప, బి.మురళి, చిన్నప్ప లు ఆక్రమించి ఈ పాస్ పుస్తకం సృష్టించి అక్రమం గా కరెంట్ సర్వీస్ పొందారు. తర్వాత నన్ను హతమార్చేప్రయత్నం చేశారు. అయితే, తీవ్ర గాయాలు ఉన్న నన్ను చూసి, చనిపోయానని వెళ్లి పోయారని నాగరాజు తెలిపారు. నా బొటన వేలు నరికారు. ఆ వేలును తీసుకుని ఎస్సై రవి కుమార్ దగ్గరకు వెడితే దిక్కున్న చోట చెప్పుకో అంటూ అసభ్య పదజాలంతో దూషించాడని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారింది నాకు న్యాయం చేస్తారన్న ఆశ తో వచ్చానన్నారు.

కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలం గోకుల్ నగరంలో శ్రీ కృష్ణ కోదండరాం దేవస్థానం శిథిలావస్థలో ఉంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి మాకు అప్పచెప్పాలని యాదవ్ సేవా సంఘం ఉపాధ్యక్షుడు విష్ణు నారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవాలయాన్ని పునర్ నిర్మించి నిర్వహణా బాధ్యతలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు విల్సన్, కిలారు దిలీప్ పాల్గొన్నారు.