పిన్నెల్లికి ఒక రూల్… పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు కు మరొక రూల్ ఉండకూడదు కదా?

సునీల్ అన్ని అమెరికా టూర్లకు డబ్బెక్కడిది?
సునీల్ కుమార్ చేతిలో ఎక్కువమంది దెబ్బలు తిన్నది దళితులే
ప్రవీణ్‌కుమార్‌వి లేకిమాటలు
నన్ను చంపటానికి అప్పుడే కుట్ర
దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఈ స్వయం ప్రకటిత దళిత నాయకుడు ఎక్కడున్నాడు?
నేనొక దళిత వాదిని… డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం లపై జరిగిన దాష్టికాన్ని ఖండించిన వారిని నేను ముందు వరుస లోనే ఉన్నాను
నాపై ద్వేషాన్ని పెంచే విధంగా దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి పీవీ సునీల్ కుమార్ విఫలమయ్యాడు
ప్రజలు తెలివైన వాళ్ళు… ఎవరికి అన్యాయం జరిగింది ఎవరు దుర్మార్గులు అనేది వారికి తెలుసు
ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు

ఉండి: రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఈ స్వయం ప్రకటిక దళిత నాయకుడైన పీవీ సునీల్ కుమార్ ఎక్కడ ఉన్నాడని ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. దళితులకు అన్యాయం జరిగిన ఏనాడు స్పందించలేదని, అధికారంలో ఉన్న వారి మెప్పు కోసమే వారికి ఊడిగం చేశారని మండిపడ్డారు.

డాక్టర్ సుధాకర్ ను కాళ్లు చేతులు విరిచి కట్టి నడిరోడ్డుపై హింసించినప్పుడు పీవీ సునీల్ కుమార్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యం ను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు పీవీ సునీల్ కుమార్ గొంతు ఎందుకు మూగబోయిందని నిలదీశారు. పీవీ సునీల్ కుమార్ పై నేను చేసిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేయగానే, దీన్ని ఒక కులాల మధ్య వైషమ్యంగా చిత్రీకరించేందుకు పీవీ సునీల్ కుమార్ ప్రయత్నించి విఫలమయ్యారు.

నా మీద ద్వేషం వచ్చే విధంగా జనాలని సమకూర్చాలని పాపం చాలా ప్రయత్నించి విఫలమయ్యాడు. ప్రజలు తెలివైన వాళ్ళు ఎవరికి అన్యాయం జరిగిందో, ఎవరు దుర్మార్గు లో వారికి తెలుసునని రఘురామకృష్ణం రాజు అన్నారు. మంగళవారం నాడు ఉండి నియోజకవర్గం కేంద్రంలో ఆయన మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై మాట్లాడారు. పీవీ సునీల్ కుమార్ వి ఆర్ ఎస్ కు దరఖాస్తు చేసుకున్నాడని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన దరఖాస్తును తిరస్కరించాలి.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలి. నాపై జరిగిన హత్యాయత్నం కేసులో ఆధారాలు పక్కాగా ఉన్నాయి. ఇందులో ఎవరి పాత్ర ఏమిటో కచ్చితంగా బయటకు వస్తుంది. త్వరలోనే విచారణ మొదలవుతుందని ఆశిస్తున్నాను. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి. ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారని గుర్తుచేసిన రఘురామకృష్ణం రాజు, పిన్నెల్లికి ఒక రూల్… పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు కు ఒక రూల్ ఉండకూడదు కదా? అని ప్రశ్నించారు.

ఐదేళ్లలో అమెరికాకు ఎన్నోసార్లు వెళ్లి వచ్చిన సునీల్ కుమార్

నిజాయితీ కలిగిన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తనకు తాను చెప్పుకునే పీవీ సునీల్ కుమార్ గత ఐదేళ్లలో ఎన్నోసార్లు అమెరికాకు వెళ్లి వచ్చారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అమెరికాకు వెళ్లి రావడానికి టికెట్ల ఖర్చు ఎంత అవుతుంది అని ప్రశ్నించిన ఆయన, ఆయన జీతం మొత్తం అమెరికాకు వెళ్లి వచ్చిన టికెట్లకే సరిపోతుందన్నారు.

ప్రముఖుల సహకారంతోనే పీవీ సునీల్ కుమార్ అనేకసార్లు అమెరికాకు వెళ్లి వచ్చారన్నారు. హత్యాయత్నం కేసులో పీవీ సునీల్ కుమార్ ను వదిలేస్తే తప్పించుకుపోయే ప్రమాదం ఉందన్నారు. పీవీ సునీల్ కుమార్ తో పాటు ఇతరులు చేసిన చెత్త వాదనలకు నేను ఇప్పటికే ఎన్నో టీవీ ఛానళ్ల లో వివరణ ఇచ్చానని పేర్కొన్నారు.

నన్ను చంపడానికి ముందే కుట్ర చేశారని ఆనాటి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులతో స్పష్టం

2021 మే 14వ తేదీన నన్ను అరెస్టు చేయడానికి ముందే, చంపడానికి పథక రచన చేసినట్లు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఇచ్చిన ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా స్పష్టమవుతోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్ గా పనిచేసే శ్రీకాంత్ తో పాటు ఆయన బృందం ఎమర్జెన్సీ వైద్య సహాయానికి అందుబాటులో ఉండాలని, అలాగే సూపరిండెంట్ మొబైల్ ఫోన్లో తక్షణమే స్పందించాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీకాంత్ అనే కార్డియాలజిస్ట్ పనిచేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ కు ఎలా తెలుసునని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. కలెక్టర్ కు ఎవరో చెప్పి ప్రత్యేకంగా శ్రీకాంత్ పేరును ఉత్తర్వులలో పొందుపరిచే విధంగా జాగ్రత్తలను తీసుకున్నారన్నారు. అదే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ పేరును మాత్రం, ఆ ప్రత్యేక ఉత్తర్వులలో మెన్షన్ చేయలేదన్నారు.

2021 మే 14వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు నన్ను అరెస్టు చేశారు. అంతకుముందే ఈ ప్రత్యేక ఉత్తర్వులను ఇచ్చి ఉంటే అరెస్టుకు ముందే కుట్ర చేసినట్లు అర్థమవుతుంది. ఒకవేళ నాలుగున్నర గంటల తర్వాత ఇచ్చారనుకుందాం… అప్పుడు ఈ ప్రత్యేక ఉత్తర్వులలో కచ్చితంగా నా పేరు పొందుపరిచి ఉండాలి. ప్రత్యేక పరిస్థితుల్లో వైద్యం అందించడానికి కార్డియాలజిస్ట్ అతని టీం రెడీగా ఉండాలని ఆదేశించాలి. అలా కాలేదంటే దీని భావం ఏమిటో ఇట్టే అర్థమవుతుందన్నారు. లక్కీగా ఈ ప్రత్యేక ఉత్తర్వుల కాపీ నా చేతికి వచ్చిందని తెలిపారు.

మంచం కోళ్లు విరిగేలా నా గుండెలపై కూర్చున్నారు

ఆరు నెలల క్రితమే గుండె ఆపరేషన్ చేయించుకున్న నా చాతిపై బలంగా మంచం కోళ్లు విరిగే విధంగా కూర్చున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. బలంగా చాతిపై కూర్చోవడం ద్వారా నేను చనిపోతే అప్పటికే రెడీగా ఉన్న కార్డియాలజిస్ట్ అతని టీం, ఎంతో ప్రయత్నించిన విగత జీవుడయ్యారని పేర్కొని ఉండేవారన్నారు. అరెస్టు చేయడంతో ఆందోళనకు గురైన రఘురామకృష్ణం రాజు గుండెపోటుకు గురయ్యారని చెప్పి ఉండేవారన్నారు. ఆ తెల్లారి జగన్మోహన్ రెడ్డి ముత్యాలముగ్గు చిత్రంలో రావు గోపాల్ రావు మాదిరిగా వచ్చి నా దండ వేసి ఉండేవారని పేర్కొన్నారు.

ఈ తరహా చెత్త ఆర్డర్ ను కలెక్టర్ ఇవ్వరని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు.. ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూ కోసం పోలీసులకు కాపీని పంపి, శ్రీకాంత్ అనే వైద్యున్ని అందుబాటులో ఉండాలని చెప్పి ఒక స్కెచ్ వేశారన్నారు.నేను చస్తానని వారు అనుకున్నారు. కానీ నేను చావలేదు. ఇప్పుడు వారి చావుకు వచ్చింది. దీని ద్వారా నాపై కుట్ర ఏ స్థాయిలో జరిగిందో వివేక్ యాదవ్ ఇచ్చిన ఆర్డర్ కాపీ ద్వారా స్పష్టమవుతుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రి వైద్య నివేదికలో ఎకిమోసిస్ స్పష్టంగా వెల్లడి

సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రి వైద్య నివేదికలో పోలీసులు చిత్రహింసలకు గురి చేయడం వల్లే నా కాలి వేలు రెండు చోట్ల విరిగినట్లు, రక్తం గడ్డ కట్టినట్లు, అరి కాళ్ల పై నల్లటి చారలు పేరుకుపోయినట్టు కల్నల్ స్థాయి అధికారి సమక్షంలో, ప్రస్తుత హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో పరీక్షలను నిర్వహించి వైద్య నివేదికను రూపొందించడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. దీనితో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం తప్పుడు వైద్య నివేదికను ఇచ్చినట్లు తేలిపోయింది.

అమాయక సునీల్ కుమార్, తింగరి సుధాకర్ రెడ్డి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య నివేదిక ఆధారంగా నోటికొచ్చినట్లు మాట్లాడారు. పీవీ సునీల్ కుమార్ ను అమాయక సునీల్ కుమార్ అనడం వెనుక, తొందరగా డిజిపి అయిపోవాలనుకుని ఇలా అయిపోయారని, అందుకే అమాయక సునీల్ అన్నానని తెలిపారు. ఎకిమోసిస్ అనే వైద్య భాష పదాన్ని మిలిటరీ ఆసుపత్రి వైద్య బృందం తమ నివేదికలో పేర్కొన్నారని, దీని అర్థం ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల ఏర్పడిన గాయం కారణంగా రక్తం గడ్డ కట్టడాన్ని ఎకిమోసిస్ గా పేర్కొంటారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

15 రోజుల తర్వాత బెయిల్ బాండ్స్ సమర్పించాలన్న సుప్రీంకోర్టు

బెయిల్ పేపర్ బాండ్స్ సమర్పించనిదే జైలు నుంచి విడుదల చేయరని, అటువంటిది 15 రోజుల లోపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత బెయిల్ బాండ్స్ సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రి సమర్పించిన వైద్య నివేదిక ఆధారంగా సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిందని, అందులో ప్రధానంగా ఎకిమోసిస్ అనే వైద్య భాష పదాన్ని చూసి దాడి జరిగిందన్న అంశాన్ని తోసిపుచ్చలేమని, బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా పేర్కొందన్నారు.

అయినా కొట్టలేదని పివి సునీల్ కుమార్ , గాయాలు లేవని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభావతి వైద్య నివేదికను అంతా అబద్ధమని తేలిపోయింది. గుంటూరు నుంచి హైదరాబాదుకు వెళ్లే దారిలో రఘురామ కృష్ణంరాజు తనని తానే కొట్టుకొని ఉంటారని, పీవీ సునీల్ కుమార్ తొందరపడి చేసిన వాదన ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకొనుంది. ఆరోజు నాతోపాటు పోలీసు సిబ్బంది రక్షణగా ఉన్నారని గుర్తు చేశారు.

కందిపోయిన నా కాళ్ళను మెజిస్ట్రేట్ చూసి రెండు ఆసుపత్రులకు రిఫర్ చేశారు

సిఐడి పోలీసులు చిత్రహింసలకు గురి చేయడంతో కందిపోయిన నా కాళ్ళను చూసి మెజిస్ట్రేట్ తీవ్ర షాక్ కు గురయ్యారు. ఆమె వెంటనే నన్ను రెండు ఆసుపత్రులలో చికిత్స చేయించాలని రిఫర్ చేశారు. నాపై పోలీసులు దాడి చేసిన ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. కోర్టు బయట విలేకరులు తీసిన ఫోటోలు ఉన్నాయి. జ్ఞాన శూన్య అవార్డు గ్రహీత సుధాకర్ రెడ్డి, దళిత ద్రోహి సునీల్ కుమార్ ఎన్ని కహానీలు చెప్పినా వారికి ఎంతమంది ప్రవీణ్ కుమార్లు కలిసి మద్దతు ఇచ్చినా, నిజమైన దళితులు ఎవరు వారికి మద్దతు ఇవ్వరన్నారు.

ఈ నిజం ముందు ప్రజలందరికీ తెలియాలి. దళిత నేతలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. పివి సునీల్ కుమార్ దళిత వ్యతిరేకి. అతన్ని దళితులు ఎవరు నమ్మరని, అతనికి మద్దతుగా అక్కడక్కడ బుల్లి, బుల్లి, చిన్ని, చిన్ని నిరసనలను తెలియజేస్తే అది వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నాను. దళితులకు ఏ కష్టం వచ్చినా నేను ముందు ఉంటాను. ఈ విషయాన్ని తమ్ముడు మహాసేన రాజేష్ ను అడిగి తెలుసుకోవచ్చు.

ఇదే పీవీ సునీల్ కుమార్ మహాసేన రాజేష్ ను అతడి అనుచరుడుని, శ్రీకాకుళం తీసుకువెళ్లి హింసించినప్పుడు దెబ్బతిన్న వ్యక్తితో , రాజేష్ తో నేను మాట్లాడాను. వారిని పరామర్శించాను. పీవీ సునీల్ కుమార్ చేతిలో ఎక్కువమంది దెబ్బలు తిన్నది దళితులేనని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

రాజు గారే ముందుకొచ్చి ధైర్యం చేయకపోతే… ఇంకా ఎవరు చేస్తారని అందరూ అంటున్నారు

గత ప్రభుత్వ హయాంలో అకారణంగా వేధింపులకు గురైన వారి పక్షాన రాజుగారే ముందుకొచ్చి ధైర్యం చేయకపోతే.. ఇంకెవరు చేయగలరని ప్రజలు భావిస్తున్నారని, అందుకే అందరి పక్షాన తాను పోరాడుతున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. పోలీసుల చిత్రహింసల వల్ల దెబ్బలు తిన్న నాకు పోరాడడం వల్ల కొత్తగా వచ్చేది ఏమిటని కొందరు భావించవచ్చు.

కానీ ఇటువంటి అన్యాయం మరొకరికి జరగకుండా, ప్రభుత్వం చెప్పినా ఈ తరహా అరాచకాలను పోలీసులు చేయకుండా, భయం కలగాలనే ఉద్దేశంతోనే పోరాటం చేస్తున్నానని తెలిపారు. ఈ కేసులో నేరస్తులకు శిక్ష పడుతుందన్న ఆయన, వారు పేరు మోసిన ప్రముఖ న్యాయవాదులను నియమించుకుంటారని, అందుకు తగ్గట్టుగా నేను కూడా డబ్బులు ఖర్చు పెట్టి న్యాయవాదులను నియమించాల్సి ఉంటుందన్నారు.

సునీల్ పై కంప్లైంట్ ఇస్తే ప్రవీణ్ కుమార్ చాలా ఫీలయ్యారు

నాపై హత్యా ప్రయత్నం చేసిన ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పై నేను ఫిర్యాదు చేస్తే, తెలంగాణలో ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా ఫీల్ అయ్యారని రఘురామ కృష్ణంరాజు ఎద్దేవా చేశారు. ఒక ప్రభుత్వ అధికారిపై మూడేళ్ల తరువాత కేసు నమోదు చేస్తారా?, ఇలా చేస్తే అధికారులు పనిచేయగలరా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారన్నారు. మీ కులానికి చెందిన వారైతే ఒక రూలా? మరొకరికి అయితే మరొక రూలా? అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

థిస్ ఫెలో, గయ్ అంటూ ఎమ్మెల్యేగా ఎలా ఎన్నికయ్యారంటూ ప్రవీణ్ కుమార్ లేకి మాటలను మాట్లాడారని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుడు పరిటాల రవి ని చూసి తప్పు చేసిన వారు గడగడలాడేవారు. ఆయన్ని కిరాయి గుండాలు వచ్చి చంపినప్పుడు, అనంతపురం జిల్లా ఎస్పీగా ఈ మహానుభావుడే ఉన్నాడు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా ఉండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, చంపాలనుకొని వచ్చే వారిని చంపనిస్తాడు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లలో మూడుసార్లు ఓడిపోయారు. రెండుసార్లు బీఎస్పీ తరఫున ఎమ్మెల్యేగా, ఒకసారి బి ఆర్ ఎస్ తరపున ఎంపీగా ఓడిపోయారు. ఆయనకు ఆయన ఎక్కువగా ఊహించుకొని తుక్కు తుక్కుగా ఓడిపోగా, నేను ఎమ్మెల్యేగా 56 వేల 777 ఓట్ల మెజారిటీతో గెలిచాను. 64% ఓట్లు నాకు పోల్ అయ్యాయి. నేను ఎమ్మెల్యేగా గెలిచినందుకు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ మాత్రం షాక్ లో ఉండడం సహజమేనని అపహస్యం చేశారు.

ఐపీఎస్ చదివి ప్రవీణ్ కుమార్ పాసయ్యారని అనుకుంటున్నాను. ఇప్పటికైనా లేకి మాటలు మాట్లాడడం మానేయాలి. ఆయన బాధ ఆక్రోశానికి కారణం లేకపోలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్రభుత్వ సర్వీసులలో కొనసాగుతూ ఈ దేవుళ్లను, ఆ దేవుళ్లను మొక్క రాదని, మతం గురించి ఆయన మాట్లాడడాన్ని నేను పార్లమెంటులో ప్రస్తావించాను.

రాజ్యాంగంలో పౌరులకు కలిగిన హక్కులను ఆర్టికల్ 14 నుంచి 22, 24 వరకు పొందుపరిచారు. సాధారణ పౌరులకు ఇచ్చిన హక్కులను, ప్రభుత్వ అధికారులకు ఇవ్వలేదు. ప్రభుత్వ అధికారులకు కొన్ని సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు కొన్ని నిబంధనలు ఉంటాయి. హాస్టల్ లో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన కొన్ని నిర్వాహకాల గురించి నేను పార్లమెంట్ లో ప్రస్తావించడం ద్వారా, వివరాలను అందజేయాలని ఆదేశించడం జరిగింది.

దీనితో వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజకీయ రంగంలోకి వచ్చి భంగపాటు పడ్డారు. ప్రవీణ్ కుమార్ తో పాటు, పీవీ సునీల్ కుమార్ కులాన్ని అడ్డుపెట్టుకొని వికృత చేష్టలు చేయడం తగదని రఘురామకృష్ణం రాజు అన్నారు.

అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ముందుకు రానున్న దాతలు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరిట ఏర్పాటు చేయనున్న అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం ఎంతోమంది దాతలు ముందుకు రానున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే విదేశాల్లో స్థిరపడిన వారు, స్వదేశంలో నివసించే వారు ఒక పూట భోజనం పెట్టడానికి ముందుకు రావడం ఖాయం అన్నారు. ఒక పూట భోజనం పెట్టేవారి ఫోటో, వారి ఫ్యామిలీ ఫోటో అన్నా క్యాంటీన్లలో కనిపించే విధంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఒక టీవీని ఏర్పాటుచేసి టీవీలలో దాతల ఫోటోలను ప్రదర్శించాలన్నారు.

అవసరమైతే స్క్రీన్ కూడా దాతలే ముందుకు వచ్చి అందజేస్తారని తెలిపారు. ఆకలితో ఉన్నవారు భోజనం చేసి అన్నదాత సుఖీభవ అని దీవిస్తే, దాతలకు వెయ్యినుగుల మానసిక బలాన్ని ఇస్తుందన్నారు. ఒక మంచి పని చేస్తే లభించే గుర్తింపు ఇతరులను మంచి పని చేయడానికి ప్రోత్సాహకాన్ని ఇస్తుందన్నారు. ప్రభుత్వం అతి తక్కువ బడ్జెట్లో ఈ విధంగా అన్నా క్యాంటీన్లను నిర్వహించవచ్చునని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

మన సంస్కృతి సాంప్రదాయంలోనే అన్నార్తులకు భోజనం పెట్టి పంపాలని పేర్కొనడం జరుగుతుందన్న ఆయన, గురుద్వారకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి పంపడం జరుగుతుందన్నారు. ఏ మతంలోనైనా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలని చెప్పడం జరుగుతుందని తెలిపారు.

సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు

ఉండి నియోజకవర్గ పరిధిలోని సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతుల కల్పనకు నా స్నేహితుల సహకారంతో అన్నీ చర్యలు తీసుకోనున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. సంక్షేమ హాస్టల్లో పరిస్థితి చూసిన తర్వాత నా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. బోర్డింగ్ స్కూళ్లలో ఉండే వసతులకు తక్కువ కాకుండా ఉండి నియోజకవర్గ పరిధిలోని సంక్షేమ హాస్టల్లో సౌకర్యాలను కల్పించడం జరుగుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మినిమం బడ్జెట్ తో సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్యాన్లు, డైనింగ్ టేబుల్, బాత్రూంలు, టాయిలెట్లు కనీస సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలో సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతుల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల క్రీడా ప్రాంగణాలను ఆగస్టు 15వ తేదీ నాటికి అభివృద్ధి చేయడమే కాకుండా గ్రీనరీ ఏర్పాటు చేస్తామన్నారు. గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నిర్దేశించిన సమయంలో గా ప్రభుత్వ పాఠశాలల క్రీడా ప్రాంగణాల అభివృద్ధిలో ఎటువంటి ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.