_ నాలుగున్నరేళ్లు ఎమ్మెల్యే ద్వారంపూడి ఎందుకు మౌనం వహించారో చెప్పాలి
_ అఖిలపక్షం డిమాండ్
కాకినాడ మార్చి 11: కాకినాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను ఓఎన్జిసి, ప్రభుత్వ అధికారులు మభ్యపెడుతున్నారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. మత్స్యకారులకు ఓఎన్జీసీ సంస్థ వల్ల జరిగే నష్టపరిహారం నిమిత్తం సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారని ఇది మత్స్యకారులకు సంబంధించిన అన్ని ప్రశ్నలను మభ్య పెట్టేలా చర్యలు ఉన్నాయని అఖిల పక్ష నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు పప్పు దుర్గా రమేష్, ఆకుల ప్రవీణ్, మల్లాడి రాజు, తాటిపాక మధు, రంబాల సతీష్, పిట్టా వరప్రసాద్, నరాల శివ, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, శేరు చిన్న, మల్లిపూడి వీరు , దువ్వ శేషబాబ్జీలు జిల్లా కలెక్టర్తో పాటు ఓఎన్జిసికి కూడా వినతి పత్రాన్ని సోమవారం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ కృత్తికా శుక్ల వ్యాఖ్యలకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలకు పొంతన లేదన్నారు. జనవరి 4న సర్క్యులర్ వచ్చినా ఎందుకు మత్స్యకారులకు కార్యకలాపాల వివరాలు గురించి తెలియజేయలేదంటూ ప్రశ్నించారు. ఓఎన్జీసీ సముద్రతీర ప్రాంతంలో ఏ కార్యకలాపాలు చేపడుతుందో ఎందుకు ఇప్పటివరకు తెలియజేయలేదంటూ వారు మండిపడ్డారు. అందరితో కాకుండా ఒక్కొక్క రాజకీయ పార్టీతో కలెక్టర్ విడిగా పిలిచి మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు.
గత ఎన్నికల్లో మత్స్యకారులకు ఓఎన్జీసీ నుంచి నష్టపరిహారాన్ని ఇప్పిస్తానని ఓట్లు వేయించుకుని మోసం చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ నాలుగున్నర ఏళ్ళు మౌనంగా ఉండి ఇప్పుడు మరలా ఓఎన్జీసీ పైకి నెపాన్ని నెట్టివేస్తూ, మీకు పరిహారం అందించేందుకు కృషి చేస్తానని, పోరాటం చేస్తానని చెప్పడం రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసం ఆడే నాటకమన్నారు. దీన్ని మత్స్యకారులు మరో ఒక్కసారి నమ్మి మోసపోయే పరిస్థితుల్లో లేరని అఖిలపక్ష నాయకులు చెప్పారు.
ఓఎన్జీసీ, ప్రభుత్వ యంత్రాంగం వద్ద ఏ విధమైన తప్పు లేనప్పుడు మీడియాని ఎందుకు ఆహ్వానించలేదని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా మత్స్యకారులను గుర్తించి, వారి ఆందోళనలను పరిగణలోకి తీసుకొని పరిహారం అందించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.