మంగళగిరిలో కొనసాగుతున్న ఉచిత నేత్ర వైద్య శిబిరం

– ఈ నెల 18 నుంచి 22 వరకు ఉచితంగా శస్త్రచికిత్సలు
– 20 వరకు కంటిపొర పరీక్షలు
– సుమారు రూ. 25 వేల విలువ గల ఆపరేషన్లు ఉచితంగానే..
– నిర్వాహకులు విజయ్ కుమార్, బాలకృష్ణ వెల్లడి

మంగళగిరి, మహానాడు: శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానం ఆవరణలో ఎన్నారైలు కొట్టి వాయునందనరావు, రామానుజరావు, రామ్ ల ఆధ్వర్యంలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, చెన్నై శంకర నేత్రాలయ కంటి వైద్యశాల సహకారంతో మంగళగిరికి చెందిన దివంగత రాఘవరపు వసుంధర జ్ఞాపకార్థం ఈనెల 14న ప్రారంభమైన ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం కొనసాగుతోంది. ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 20వ తేదీ వరకు కంటిపొర పరీక్షలు నిర్వహిస్తారు. 18 నుండి 22 వరకు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారు. లెన్స్ తో కలిపి సుమారు 25 వేల రూపాయలు అయ్యే ఆపరేషన్లు ఉచితంగా చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

వైద్య శిబిరాన్ని బుధవారం స్థానిక గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి.అనూష, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు గాదంశెట్టి సుజాత, ఆంధ్ర ప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్టి, టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, అన్నం నాగబాబు, తిరుమల శెట్టి హనుమంతరావు సందర్శించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష చేతుల మీదగా రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాఘవరపు విజయ్ కుమార్, పారేపల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.