ఆంధ్రప్రదేశ్ అనాథ

జగన్ లొంగుబాటు పర్యవసానంగా ట్రిబ్యునల్ ఏర్పాటు!
జీవన్మరణ సమస్యగా పరిణమించిన కృష్ణా జలాల సమస్య!
కూటమి ప్రభుత్వం వినడానికే సిద్ధంగా లేదు!
రాజకీయ పార్టీలకు అసలు ఈ సమస్యే పట్టలేదు!

నిన్న, మొన్న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ – II (బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్) ఈ అంశంపై విచారణ ప్రక్రియను కొనసాగించింది. తెలంగాణ లేవనెత్తిన నీటి వివాదాన్ని విచారించడానికి 40 ముసాయిదా అంశాలను ఖరారు చేసిందని ప్రసరమాధ్యమాల్లో వార్తలొచ్చాయి. వాటి ప్రాతిపదికన విచారణను కొనసాగించడానికి తదుపరి విచారణను సెప్టెంబరు 20కి వాయిదా వేసింది.

నీటి పంపకాల వివాదాలకు సంబంధించి సంబంధిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమ తమ వాదనలు వినిపించాలి. సాక్ష్యాలను సమర్పించాలి. ట్రిబ్యునల్ తమకు సమర్పించిన సమర్పణలను సమీక్షిస్తుంది. చారిత్రక నీటి వినియోగం, పరివాహక ప్రాంతం కొలబద్ద వర్తిస్తుందా – లేదా, భవిష్యత్తు అవసరాలతో సహా ట్రిబ్యునల్ ముందుంచే సమాచారాన్ని విశ్లేషించి, తీర్పు ఇస్తుంది. అంతర్రాష్ట్ర నదీ జలాల వినియోగానికి సంబంధించి ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యం.

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ – I (బచావత్ ట్రిబ్యునల్), కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ – II (బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్) విచారణ కాలంలో తెలంగాణ రాష్ట్రం ఉనికిలో లేదని, పర్యవసానంగా తెలంగాణకు నీటి పంపకంలో నష్టం జరిగిందంటూ తెలంగాణ వాదిస్తున్నది.

ఆ రెండు ట్రిబ్యునల్స్ విచారణ, అవార్డులు ఇచ్చినప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు ఉనికిలో లేదు. గతంలో ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులను రెండు రాష్ట్రాలకు శిరోధార్యమని ఆంధ్రప్రదేశ్ పున్వ్యవస్థీకరణ చట్టంలో విస్పష్టంగా పేర్కొన్నారు. అయినా, తెలంగాణ వివాదాన్ని లేవనెత్తింది.

మోడీ ప్రభుత్వం ఆ వివాదంలోని హేతుబద్ధతను పరిగణనలోకి తీసుకోకుండానే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును పెంచి, విచారించి, తీర్పు ఇమ్మని బాధ్యత అప్పగించింది. తద్వారా, కృష్ణా జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హక్కులపై కత్తి వేలాడుతున్నది.

సమస్య తీవ్రతను రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి ఎన్నికలకు ముందే మే నెలలో “కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ – కొత్త ప్రభుత్వం ముందున్న పెనుసవాల్” శీర్షికతో ఒక చిరుపుస్తకాన్ని వ్రాసి, ప్రచురించాను. ఈ సమస్యపైనే రైతు సంఘాల సమావేశం విజయవాడలో నిర్వహించబడింది. ఈ సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి రైతు సంఘాల ప్రతినిధివర్గానికి ఇంటర్యూకోరుతూ ఉత్తరం వ్రాశాను. స్పందన కరవయ్యింది.

అటుపై, సమస్యను వివరిస్తూ ఐదు పేజీల వినతిపత్రాన్ని ఇ – మెయిల్, వాట్సాప్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి పంపాను. దాన్ని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకి, కృష్ణా నది జలాలపై ఆధారపడి ఉన్న జిల్లాల నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులకు పంపాను. దాన్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాను. తద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను.

కరవు పీడిత రాయలసీమ ప్రాంతంలో దశాబ్ధాలుగా నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, హంద్రీ – నీవా సుజల స్రవంతి, గాలేరు – నగరి సుజల స్రంతి, ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న వెలిగొండ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారింది. వినియోగంలో ఉన్న పురాతనమైన కృష్ణా డెల్టా ఆయకట్టులోని అత్యధిక భాగాలు, నాగార్జునసాగర్ కుడి కాలువ ఆయకట్టు, పురాతనమైన కర్నూలు – కడప కాలువ, తుంగభద్ర ఎగువ కాలువ, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ, వగైరా ప్రాజెక్టులన్నీ కృష్ణా బేసిన్ బయట ఉన్న ప్రాజెక్టులని, వాటికి కేటాయించిన నీటిని తెలంగాణకు కేటాయిస్తూ పున: పంపిణీ చేయాలని తెలంగాణ అడ్డగోలుగా వాదిస్తున్నది.

ఇంతటి ప్రమాదకర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కు ఎదురైనా ప్రభుత్వంలో కానీ, రాజకీయ పార్టీల్లో కానీ, పెద్దగా చలనం లేకపోవడం అత్యంత దురదృష్టకరం. ఇప్పటికైనా దృష్టిసారించి, ట్రిబ్యునల్ ముందు సమర్థవంతంగా వాదనలు వినిపించి, ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను పరిరక్షించకపోతే భావితరాలు క్షమించవు.

– టి. లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక విజయవాడ