– ధార వాటర్‌ప్లాంట్ ప్రారంభం
– లేగుంటపాడులో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
– ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం
– ప్రజా సేవకు రాజకీయాలతో సంబంధం లేదు
ఓ వైపు మంగళ వాయిద్యాలు, మరో వైపు బాణసంచా మోతలు, కనుచూపు మేర పసుపు తోరణాలతో లేగుంటపాడు గ్రామం దద్ధరిల్లిపోయింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతుల రాకతో లేగుంటపాడు గ్రామంలో పండుగ వాతారణం కనిపించింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన వేమిరెడ్డి దంపతులకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.
ముందుగా వేమిరెడ్డి దంపతులు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వి.పి.ఆర్ అమృతధార వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం అత్యాధునిక హంగులతో నిర్మించిన లేగుంటపాడు గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి, సిసి రోడ్డు, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలా ఫలకాలు ఆవిష్కరించారు. గ్రామంలో 6 లక్షలతో సిసి రోడ్లు, 38 లక్షల నిధులతో ట్యాంకు నిర్మించనున్నారు. అనంతరం స్థానిక సర్పంచ్ జెట్టి రాజగోపాల రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులను టిడిపి నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను అనుకోని పరిస్థితులలో ప్రత్యక్ష రాజకీయాలలోనికి వచ్చానని, తాను చేసే సేవా కార్యక్రమాలకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. ఎన్నికలయ్యాక తాము ప్రజలకు అందుబాటులో ఉండమని అవాకులు చెవాకులు ప్రచారం చేసిన ప్రత్యర్ధులకు తమ పనితీరుతోనే సమాధానం చెబుతామన్నారు. లేగుంటపాడు గ్రామానికి హైవేతో కనెక్టివిటి రోడ్డుకు నిధులు సాధించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 వాటర్ ప్లాంట్లు పెట్టామని, ఒక్క కోవూరు నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 18 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
లేగుంటపాడు గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న స్థానిక సర్పంచ్ జెట్టి రాజ గోపాల్ రెడ్డి సేవలను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా పని చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో కోవూరు నియోజకవర్గంలో కాలువల్లో పూడిక తీసేందుకు సొంత నిధులు వెచ్చించి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రొక్లెయిన్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల అవసరార్ధం కొన్ని అత్యవసర పనులకు సొంత నిధులు వెచ్చించడానికి కూడా వెనకాడేది లేదన్నారు.
అనంతరం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ లేగుంటపాడు గ్రామంలో వాటర్ ప్లాంట్ పెడతానన్న తన ఎన్నికల హామీని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అమలు చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి గ్రామంలో లేగుంటపాడు సర్పంచ్ జెట్టి రాజ గోపాల రెడ్డి లాంటి ప్రజా ప్రతినిధులు ఉంటే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించవచ్చన్నారు. గ్రామాలలో నాయకులు పార్టీలకతీతంగా పని చేస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
రానున్న వర్షాకాలంలో కాలువల పూడికతో లోతట్టు ప్రాంతాలకు ముంపు వాటిల్లకుండా ఉండేందుకై క్లీన్ కోవూరు పేరిట పూడికతీత తొలగింపు కార్యక్రమం చేపట్టానన్నారు. ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో తన ఎన్నికల నినాదమైన అవినీతిరహిత, వివాదరహిత కోవూరు సాధిస్తానన్నారు. ఎన్నికల సందర్భంగా తన దృష్టికి వచ్చిన వాటర్ ప్లాంట్ల హామీలను సాధ్యమైనంత త్వరలో కార్యరూపం దాల్చేలా చూస్తానన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సేవలో తరించాలన్నదే తన ఆశయమన్నారు.
అనంతరం లేగుంటపాడు హైస్కూలులో వేమిరెడ్డి దంపతులు విద్యార్ధులకు విద్యా కిట్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో లేగుంటపాడు సర్పంచ్ జెట్టి రాజ గోపాల్ రెడ్డి, వేగూరు సర్పంచ్ అమరావతి, కోవూరు ఎంపిపి తుమ్మలపెంట పార్వతి, టిడిపి జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, కోవూరు, విడవలూరు, ఇందుకూరుపేట టిడిపి మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, చెముకుల శ్రీనివాసులు, వీరేంద్ర నాయుడు, టిడిపి నాయకులు పాశం శ్రీహరి రెడ్డి, నల్లపురెడ్డి సురేష్ రెడ్డి, రామిరెడ్డి భానురెడ్డి, బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి, ఆవుల వాసు, అడపాల శ్రీధర్ రెడ్డి, ఇమాం బాషా, పంది రఘురాం, ఎంపిటిసిలు పుచ్చలపల్లి శ్రీనివాసులు రెడ్డి, నాగరాజు, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, బిజెపి నాయకులు రాఘవేంద్ర, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.