రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, మహానాడు: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా ఉన్నత చదువులు చదివిన వారు. వీరికి ఏజెన్సీల ద్వారా జీతాలు అందిస్తున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్, జీఎస్టీ పోయిన తర్వాత తొమ్మిది వేలు కూడా అందడం లేదు. వీరు అడుగుతున్న డిమాండ్లు పెద్దవి కావు. డిపార్ట్మెంట్ నేరుగా జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సేఫ్ గార్డ్స్ ఇవ్వాలి (కొన్ని మార్కులు కలపాలి). నెల వారీగా జీతాలు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈఎస్ఐ, పీఎఫ్, హెల్త్ కార్డులు ఇప్పించాలి. ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాము.
ఉద్యోగాల భర్తీ జరుగుతుంది అని ఆశపడ్డ నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు. ఇప్పుడు జరుగుతున్న ఉద్యోగాల పరీక్షకు గ్యాప్ ఇవ్వమని అడిగితే గొడ్లను కొట్టినట్టు కొడుతున్నారు. కోచింగ్ సెంటర్లు డబ్బులు ఇస్తే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు అని సీఎం అభాండాలు వేస్తుంటే, కంచె చేను మేసినట్లు ఉంది. అహంకారంతో వ్యవహరిస్తే కేసీఆర్ కి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే పడుతుందనే సోయితో పనిచేయండి.
బేషజాలకు పోకుండా వారు అడుగుతున్న డిమాండ్స్ పట్ల సానుకూలంగా స్పందించాలని రాజేందర్ పేర్కొన్నారు.