పెనుకొండ : అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన దివంగత నేత పరిటాల రవి ఆశయ సాధనకు కృషి చేద్దామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత పిలుపునిచ్చారు. పరిటాల రవి జయంతి సందర్భంగా శుక్రవారం స్థానికంగా ఉన్న అన్న క్యాంటీన్ లో ఆయన చిత్ర పటానికి మంత్రి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, పరిటాల రవి తన జీవితాన్ని పేదల కోసం ధారపోశారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన దివంగత నేత పరిటాల రవి ఆశయ సాధనకు అందరమూ ఐక్యంగా కృషి చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న వైద్యులతో మంత్రి సవిత మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అంటురోగాలు ప్రబలుతున్నాయని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు మంత్రి సవిత దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.