త్వరలో రాజముద్రతో పాసు పుస్తకాలు

-జగన్ బొమ్మల వల్ల రూ.700 కోట్ల వృథా
-రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు
-78 లక్షల రాళ్లపై మాజీ సీఎం పేర్లు తీయాలంటే రూ.15కోట్లు ఖర్చవుతుంది:మంత్రి అనగాని సత్య ప్రసాద్ 

అమరావతి: రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

త్వరలో రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల పాసు పుస్తకాలపై మాజీ సీఎం జగన్ తన బొమ్మల కోసం రూ.15 కోట్లు ఖర్చుచేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు, ప్రజల కోరిక మేరకు రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా రాజముద్రతో ఉన్న పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, ఆ ఆస్తి అడ్రస్ వద్దకు తీసుకువెళ్లే మ్యాప్ కూడా వచ్చేలా అధికారులు ఏర్పాటు చేశారు. రీ సర్వే పేరుతో పొలాల సర్వేకి వైసీపీ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది. సరిహద్దు రాళ్లపైనా తన బొమ్మలు ఉండాలన్న నాటి సీఎం జగన్ కోరిక తీర్చుకునేందుకు రూ.650 కోట్లు ఖర్చు చేశారు.

కేంద్రం చెప్పిన రీ సర్వేలో ఎక్కడా రాళ్లు పాతమని చెప్పకపోయినా తన బొమ్మల కోసం జగన్ గ్రానైట్ రాళ్లు సిద్ధం చేశారు. మాజీ సీఎం బొమ్మ ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలనే విషయంపై ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. ఆ రాళ్లపై బొమ్మలు చెరపడానికి మరో రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తాత్కాలిక అంచనా వేశారు. జగన్ బొమ్మల పిచ్చి వల్ల మొత్తంగా రూ.700 కోట్ల వరకు ప్రజా సొమ్ము వృథా అవుతుందని గుర్తించారు. ఆ గ్రానైట్ రాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు.. వాటితో ఏం చేయాలో చూడమని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

రూట్ మ్యాప్ సిద్ధం
జిల్లాల వారీగా ఏ మేరకు భూములు అక్రమంగా అన్యాక్రాంతం అయ్యాయో లెక్కలు తీయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ పి సిసోడియా, సిసిఎల్ఎ ఆయా జిల్లాల్లో పర్యటించి సమాచార సేకరణకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 22ఏ నుంచి ఫ్రీహోల్డ్ అయిన భూమిని రిజిస్ట్రేషన్ల దగ్గర మరోసారి పరిశీలించి వాటిలో నిజమైన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో తేల్చాలని సీఎం ఆదేశించారు.

భూ సమస్యలపైనే అధిక ఫిర్యాదులు: మంత్రి అనగాని సత్య ప్రసాద్
రెవెన్యూ శాఖలో జరిగిన అక్రమాలు, ప్రభుత్వం తీసుకునే చర్యలపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ సమస్యలపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో భూములను అడ్డుపెట్టుకొని దోపిడీ చేశారు. జగన్ ప్రభుత్వ అక్రమాలపై ఈ రోజు సీఎం చంద్రబాబు నేతృత్వంలో సుదీర్ఘంగా సమీక్షించాం. మదనపల్లి ఫైళ్లు ఎంత దారుణంగా ఉన్నాయో చూశాం. వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నాయకుల చేతుల్లో అధికారులు కీలుబొమ్మలుగా ఉన్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యంతో రెవెన్యూ కార్యాలయాలకు భద్రత లేకుండా పోయింది. ఈ విషయంపై ప్రభుత్వ కార్యదర్శి అక్కడికి వెళ్లి మరీ అధ్యాయనం చేశారు.

మదనపల్లికి అధికారులు వెళ్లినప్పడు ప్రజలు భారీగా తరలి వచ్చి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఉన్న ఆర్డీవో, అంతకు ముందు ఉన్న ఆర్డీవోతోపాటు గౌతమ్‌ను కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఎన్ని ఎకరాల భూమిని 22ఏ లో పెట్టారు ఎన్ని తొలగించారు… దాని ద్వారా ఎవరికి లబ్ధి కలిగింది ఆ లెక్కలను కూడా తీయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ల్యాడ్ గ్రాబింగ్ యాక్ట్ పైనా పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు.

పాస్ పుస్తకాల్లో జగన్ ఫొటో ఎందుకు?
‘‘గతంలో ఏపీలో కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉండేది దాన్ని అధ్యయనం చేసి గుజరాత్‌లో యాక్ట్ తీసుకువచ్చారు… ఇప్పడు మేము అధ్యయనం చేసి ఆ చట్టాన్ని ప్రజలకు మేలు చేసేలా నిర్ణయిస్తాం. ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టిన భూముల వివరాలను వెంటనే అందించాలని సీఎం ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సెంట్రల్ ప్రోగ్రాంను అడ్డం పెట్టుకొని తన పేరుతో వాటిని రాయించుకున్నారు.

ఆయన పేరుతో ఉన్న సర్వే రాళ్లను ఎలా ఉపయోగించాలో పరిశీలిస్తాం. 78 లక్షల రాళ్లపై మాజీ సీఎం పేర్లు తీయాలంటే రూ.15కోట్లు ఖర్చవుతుంది. పాస్ పుస్తకాల్లో జగన్ ఫొటో ఎందుకు వేశారో అర్ధం కావడం లేదు. ఇకపై క్యూఆర్ కోడ్‌తో పాటు భూమికి ఎలా వెళ్లాలో దారి కూడా చూపేలా ఇప్పుడు పాస్ పుస్తకం ఇస్తాం. 22 ఏ లో చేసిన తప్పులను కప్పిపుచ్చేలా మదనపల్లి ఫైళ్ల సంఘటన జరిగింది. విశాఖపట్నం, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ఒంగోలులో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరమైన చర్యలు తీసుకుంటారు’’ అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు.

మదన పల్లి ఫైల్స్‌పై..
‘‘మదనపల్లి సంఘటన విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల కాలేదు. రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. 100శాతం అక్కడ షార్ట్ సర్కూట్ అయ్యే అవకాశం లేదు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు’’ అని మంత్రి అనగాని సత్యప్రసాద్ హచ్చరించారు.