భూదాహంతోనే పాస్‌పుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు: ప్రత్తిపాటి

చిలకలూరిపేట, మహానాడు: అంతులేని భూదాహంతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల ఆస్తుల పాస్‌ పుస్తకాలు, సర్వే రాళ్లపై తన బొమ్మలు వేసుకున్నారని కూటమి ప్రభుత్వం ఆ తప్పలన్నీ సరిచేస్తోందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజముద్ర, క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త పాస్ పుస్తకాలు ఎవరి భూములు వారివే అన్న నమ్మకాన్ని కలిగిస్తాయని, ఆ దిశగా నిర్ణయం తీసుకున్న మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇప్పటికే ఎన్నికలకు ముందుఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని, తాజా నిర్ణయంతో ఇక ప్రజలంతా నిశ్చింతగా ఉండొచ్చన్నారు. అదే సమయంలో ఇచ్చిన మాట మేరకే స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించడం కూడా ఎంతోమందికి మేలు చేయనుందన్నారు.

స్థానిక గడియార స్తంభం సెంటర్, ఎన్‌ఆర్‌టీ సెంటర్, అడ్డరోడ్ సెంటర్‌లోని అన్న క్యాంటీన్ భవనాలను బుధవారం ఆయన పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల ఆకలి ఎలా తీర్చాలని చంద్రబాబు గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు పెడితే, వారి ఆస్తులు ఎలా దోచుకోవాలా అని దుర్భుద్ధితో జగన్ వ్యవహరించారని దుమ్మెత్తిపోశారు. అన్న కేంద్రాల మూతతో జగన్‌రెడ్డి పైశాచికత్వం ప్రజలకు ఐదేళ్లలో అర్థమైందన్నారు.

త్వరలోనే ప్రత్యేక డ్రైవ్ ద్వారా చిలకలూరిపేట పట్టణంలో మూకుమ్మడిగా ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఏ వార్డుకు ఆ వార్డులో రోడ్లపై ఆక్రమణలకు పాల్పడ్డారో వాటిని తొలగిస్తామన్నారు. ఇప్పటికే ఆక్రమణల తొలగింపునకు కార్యాచరణ మొదలుపెట్టామని, ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అక్రమ నిర్మాణాలను తొలగించుకోవాలని సూచించారు. లేకపోతే మున్సిపల్ సిబ్బందే వాటిని తొలగిస్తారన్నారు. ఈ 2, 3 రోజుల్లో అన్ని సచివాలయాల సిబ్బందికి కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ వార్డుకు ఆ వార్డులో ప్రజల సౌకర్యార్థం ఆక్రమణలను తొలగిస్తామని, 10 మందికి బాధ కలిగించవచ్చునేమో గానీ 90 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. అన్ని సచివాలయాల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పట్టణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. ఆక్రమణల్లో ఉన్నవారు కూడా సహకరించాలని కోరారు.