– 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షపై దేశవ్యాప్తంగా చర్చ
అమరావతి, మహానాడు: అమృతతుల్యంగా… పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం పై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ చేపట్టిన స్టాండ్ ను ప్రతీ ఒక్కరూ హర్షిస్తున్నారు. గత పాలకుల వికృత పోకడల ఫలితంగా తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రమైంది. జంతు అవశేషాలతో మాలిన్యమైంది. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకం. లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని పవన్ కల్యాణ్ ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం నుంచి నంబూరు శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో చేపట్టిన 11 రోజుల ప్రాయాశ్చిత్త దీక్ష దేశవ్యాప్తంగా సంచలనమైంది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దేశవ్యాప్త హిందూ ధర్మపరిరక్షణకు ఆయన పూనుకున్నారని అన్నివైపుల నుంచి మద్దతు పెరుగుతుంది.
‘పవన్’ దీక్షకు గత పాలకులతీరే కారణం
వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించిందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
అవసరమైతే సీబీఐ ఎంక్వైరీ జరగాలి
లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురి చేసింది. ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైందని.. అందులో భాగంగానే ఆయన ప్రాయాచ్చిత్తదీక్ష చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. లడ్డులో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించి వేగవంత నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఈ వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీకి ఆయన డిమాండ్ చేశారు.
సనాతన ధర్మానికి అర్ధం చెప్పిన పవన్ కల్యాణ్
భారతదేశంలో నివసిస్తున్న ఎవరైనా కులమతాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని ఆచరించాలి. సనాతన ధర్మం అంటే మతం కాదు ప్రాచీన కాలం నుండి అనుసరిస్తున్న ఒక జీవన విధానంగా పవన్ కల్యాణ్ అర్ధం చెప్పారు. ఆయన ఒక కులానికో, ప్రాంతానికో, మతానికో ప్రతినిధి కాదు. స్వచ్ఛమైన భారతదేశ ప్రజలకు ప్రతినిధిగా ఇప్పటికే నిరూపించుకున్నారు. మతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటేనని.. ఈశ్వర్, అల్లా, ఏసు అయినా ఒక్కరే అని నమ్మే వ్యక్తి పవన్. అలాగే ప్రతీ మత విశ్వాసాలను అమితంగా విశ్వసించే వ్యక్తి ఆయన. అటు రామాలయానికి రూ.30 లక్షలు విరాళం ఇచ్చి, ఇటు మసీద్ కి రూ. 25లక్షలు విరాళం ఇచ్చి తన లౌకికవాదాన్ని చాటిచెప్పారు. వారి దృష్టిలో భగవద్గీతైనా, బైబిలైనా, ఖురానైనా ఎంతో పవిత్రమైన గ్రంథాలే.. తన ఇంట్లో ప్రతేటా క్రిస్మస్ వేడుకలు జరుపుకొంటానని పవన్ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రస్తావించడం తెలిసిందే. అలాగే ప్రతీరోజు పూజలు చేస్తారు. ఎన్నికల్లో తను నామినేషన్ వెయ్యడానికి వెళ్ళేటప్పుడు కూడా పిఠాపురంలో బాప్టిస్ట్ చర్చిలో ప్రార్ధనలు, బషీర్ బాబా దర్గాలో దీవెనలు, కుక్కుటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకొని సెక్యులరిజానికి సాక్షిగా పవన్ కల్యాణ్ నిలబడ్డారు.