– మంత్రి మనోహర్
తెనాలి, మహానాడు: గుంటూరు జిల్లా తెనాలిలోని బోసురోడ్డులోని నూకల రామకోటేశ్వరరావు కల్యాణ మండపంలో వరద పీడిత గ్రామ పంచాయతీలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం సాయంత్రం జరిగింది. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో జిల్లాలోని 5 మండలాల పరిధిలోని 25 గ్రామ పంచాయతీలకు వరద సాయం కింద లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. బాపట్ల ఎంపిపీ టి కృష్ణ ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుతో కలిసి కొల్లిపర మండలంలోని రెండు, తెనాలిలో రెండు, కొల్లూరులో 14, రేపల్లెలో ఒకటి, భట్టిప్రోలులో నాలుగు, కాకుమానులో రెండు పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున చెక్కులను పంచాయితీ సర్పంచ్‌లకు మంత్రి మనోహర్ అందజేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధి అనే వారు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రజానీకం కోసం, రాష్ట్ర అభివృద్ది కోసం పవన్ కల్యాణ్ ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. అందుకే విపత్తు సమయంలో ఆయన సొంత నిధులను సాయంగా ప్రకటించారని పేర్కొన్నారు.
వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సహాయం త్వరితగతన గ్రామపంచాయతీ సర్పంచులకు అందజేయడం ముదావహం… గ్రామాల్లో పారిశుద్ధ్యం విద్యుత్ సౌకర్యం… గ్రామ పంచాయతీల అభివృద్ధి మంత్రి కార్యక్రమాలకు ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగానే కాకుండా మానవతా దృక్పథంతో స్పందించే గొప్ప గుణ సంపన్నుడని అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవాలని మంచి మనసుతో తన వంతు తక్షణ సహాయం ప్రకటించారన్నారు. దీంతో సర్పంచులకు గ్రామ సమస్యల పట్ల బాధ్యతలు పెరిగాయని అన్నారు. కార్యక్రమంలో సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.