-తొలి అడుగుతోనే 3.44 లక్షలకు పైగా మెజారిటీ
– రిటర్నింగ్ అధికారి చేతులమీదుగా డిక్లరేషన్
గుంటూరు: ప్రజాభిమానం పెల్లుబికితే ప్రజాతీర్పు ఇలానే ఉంటుందని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు పార్లమెంటుకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ నాగార్జున యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించారు. వైసీపీ తరపున పోటీ చేసిన తన ప్రత్యర్థి కిలారు వెంకట రోశయ్యపై పెమ్మసాని చంద్రశేఖర్ 3,44,695 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా తొలి రౌండు ప్రారంభం నుంచి ఆధిక్యతను పెమ్మసాని కనబరిచారు. ప్రతిరౌండ్‌లోనూ వేలకొద్ది మెజారిటీతో ఆయన తన విజయ పరంపర కొనసాగించారు. కాగా 22 రౌండ్లు ముగిసేసరికి భారీ ఆధిక్యత దిశగా దూసుకువెళ్లిన పెమ్మసాని విజయాన్ని ఎన్నికల అధికారులు ఖరారు చేశారు.
కాగా మంగళగిరి, తాడికొండ, తదితర నియోజకవర్గాలలో పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించి నిర్వహించిన ఓట్ల కౌంటింగ్‌లో కొన్ని ఈవీఎంలు మొరాయించాయి. కాగా మొరాయించిన ఈవీఎంలను అధికారులు ఉదయమే పక్కన పెట్టారు. సుమారు పది ఈవీఎం లను అలా పక్కన పెట్టడంతో పెమ్మసాని ఆ ఈవీఎంలను కూడా కౌంటింగ్‌కు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డిని విజ్ఞప్తి చేశారు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం ఒకసారి కౌంటింగ్ ఆగిన తరు వాత ఈవీఎంల లెక్కింపు చేయలేమని ఆర్వో వివరించారు. దీంతో అధికారుల సమక్షంలో పెమ్మసాని చంద్రశేఖర్‌ను గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా ధ్రువీకరిస్తూ రిటర్నింగ్ అధికారి హోదాలో పెమ్మసానికి జిల్లా కలెక్టర్ డిక్లరేషన్ ఫారం ను మంగళవారం రాత్రి అందజేశారు.