దివ్యాంగులకు పెన్షన్‌ రూ.6000 ఇస్తాం

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన
మందకృష్ణమాదిగతో సమావేశం తర్వాత వెల్లడి

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి, మహానాడు న్యూస్‌ : దివ్యాంగులకు పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో వారు హర్హాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా ప్రజాగళం పర్యటనలో భాగంగా సత్తెనపల్లిలో బస చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆదివారం ఎమ్మార్పీఎస్‌ అధినేత, విభిన్న ప్రతిభావంతుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ప్రత్యేకంగా సమావేశమ య్యారు. అయితే ఈ సమావేశం విభిన్న ప్రతిభావంతుల సమస్యలు, వారి పెన్షన్ల పెంపునకు సంబంధించి కావడం గమనార్హం. ఈ సమావేశంలో మందకృష్ణతో పాటు విభిన్న ప్రతిభావం తుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఉన్నారు. రూ.6000 పెన్షన్‌ పెంచాలని చంద్రబాబును వారిద్దరూ కోరగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దివ్యాంగుల పెన్షన్‌ పెంపు గురించి చంద్రబాబు ఇచ్చిన హామీపై హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి.

ఆయన బసచేసిన ప్రాంగణానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన విభిన్న ప్రతిభావంతులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విభిన్న ప్రతిభావంతులకు రూ.6000 పెన్షన్‌ ఇస్తామని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా ప్రకటించారు. చంద్రబాబు ప్రకటనతో టీడీపీ కూటమికి దివ్యాంగ సంఘ నాయకులు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు తమ కుటుంబాలతో సహా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి విభిన్న ప్రతిభా వంతుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పూదోట సునీల్‌కుమార్‌, విభిన్న ప్రతిభావంతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.