కౌంటింగ్‌ వేళ…పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు

-ఆయనపై తుళ్లూరు పీఎస్‌లో ఫిర్యాదు
-ఇప్పటికే సజ్జలపై కేసు నమోదు
-అధికారులను భయపెట్టేలా వ్యాఖ్యలు
-గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్‌ లో పేర్ని నానిపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

అమరావతి: కౌంటింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల కౌంటింగ్‌ ఏజెంట్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయగా నిన్నటి రోజున వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అధికారులను భయపెట్టేలా వ్యాఖ్యలు చేశారు. సజ్జలపై ఇప్పటికే టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండురోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు అధికారులను రెచ్చగొట్టేలా ఉన్నాయని మచిలీపట్నం నగర టీడీపీ అధ్యక్షుడు ఇలియాస్‌ పాషా, 45వ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ ఫణి కుమార్‌, లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి గూడపాటి లక్ష్మీ నారాయణ తుళ్లూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.