నెల్లూరు టీడీపీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు

-టీడీపీ నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు..
-డబ్బులు దాచారంటూ పోలీసులు హంగామా చేశారని కోటంరెడ్డి మండిపాటు

నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు.  మాజీ మంత్రి నారాయణ సన్నిహితుల నివాసాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణ ముఖ్య అనుచరుల నివాసాల్లో భారీగా డబ్బులు ఉన్నాయనే ఈ దాడులు చేసినట్లు చర్చ జరుగుతోంది. నారాయణ విద్యాసంస్థల ఉపాధ్యాయుల నివాసాలలో కూడా పోలీసుల తనిఖీలు జరిగాయి.

పోలీసుల సోదాలు విషయం తెలియడంతో.. టీడీపీ మహిళా నేత విజితా రెడ్డి నివాసానికి మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కోడ్ రాకముందే దౌర్జన్యాలు ఎందుకు చేస్తున్నారని కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తారా?అని ప్రశ్నించారు.

విజితారెడ్డి ఇంటికి 20 మంది పోలీసులు వచ్చారు. ఇంట్లోని బీరువాలను, వస్తువులను తనిఖీ చేశారు. ఇంట్లో కేవలం రూ. 25 వేల నగదు మాత్రమే దొరకడంతో వెనుదిరిగారు.

నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవటంతో, జగన్ రెడ్డి పిచ్చి పీక్స్ కి వెళ్ళిందని కోటంరెడ్డి అన్నారు. పోలీసులను ఉపయోగించుకుని టీడీపీ నేతలపై కక్షసాధింపు చేస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ మహిళా నేత విజితారెడ్డి ఇంటిపై పోలీసులు దాడులు చేసి, ఇంటిని చుట్టుముట్టి హంగామా చేశారని అన్నారు. ఎన్నికలకు డబ్బులు దాచారంటూ, ఇంట్లోని బీరువా, వస్తువులను చిందరవందర చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వెన్ని చేసినా, ఎన్నికల లోపే, ఒక్కో జిల్లాలో నిన్ను ఖాళీ చేస్తాం, ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందని… అన్ని వ్యవస్థలు పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు.

తాజాగా మాజీ మంత్రి అనుచరుల ఇళ్లలో సోదాలు చేయడం చర్చనీయాంశం అయ్యింది. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. అమరావతి భూములకు సంబంధించి పోలీసులు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.