మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 10 వేల కోట్ల విలువ చేసే 34,511 ఎస్డీఎఫ్ పనులను రద్దు చేయడమే దీనికి నిదర్శనమని అన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకొని, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్నారు. “రేవంత్ రెడ్డి దివాళాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట. రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మంజూరైన అనేక పనులను నిలిపివేయడం దుర్మార్గం,” అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మంజూరైన 10 వేల కోట్ల విలువైన 34,511 పనులను రద్దు చేసింది. బీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఈ వివరాలను అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించింది. ఇప్పటికే ప్రారంభమైన అనేక పనులను కూడా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు.
దీంతో పంచాయతీరాజ్, మున్సిపల్, రోడ్లు-భవనాలు, నీటిపారుదల వంటి విభాగాల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు ప్రతి గ్రామంలో నిలిచిపోయాయని హరీష్ రావు అన్నారు. ఫలితంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రక్రియకు ఆటంకం కలిగిందని, ఉపాధి అవకాశాలు కూడా తగ్గాయని ఆయన వివరించారు.
ఈ ప్రభుత్వానికి కొత్త పనులను చేపట్టే శక్తిసామర్థ్యాలు లేవని ఇప్పటికే తేలిపోగా, మంజూరైన పనులను పూర్తి చేసే కనీస నైతిక బాధ్యత కూడా లేదని పనుల రద్దుతో స్పష్టమైంది అని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గాలకు కేటాయించిన ఎస్డీఎఫ్ నిధులను ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసింది. అయితే ఈ నిధుల నుండే మార్చి నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు 10 కోట్ల చొప్పున మంజూరు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు కేటాయించడం దుర్మార్గమని హరీష్ రావు ఆరోపించారు. “కాంగ్రెస్ గెలవని నియోజకవర్గాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం తన కురచ బుద్ధిని, పక్షపాత ధోరణిని చూపుతోంది,” అని అన్నారు.
ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో ప్రజల అవసరాలు మారవు. మారేది కేవలం ప్రభుత్వాలు మాత్రమే అని అన్నారు. గత ప్రభుత్వ ఆనవాలు లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి తన అనాలోచిత చర్యలతో తన ఆనవాలునే ప్రజల్లో లేకుండా చేసుకుంటున్నారని హరీష్ రావు విమర్శించారు. “ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్వార్థపూరిత రాజకీయాలు పక్కనబెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలి,” అని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మంజూరైన పనులు ప్రజల అవసరాల కోసం కాబట్టి, వాటిని పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయాలని కోరారు.