– కమిషనర్ శ్రీనివాసులు
గుంటూరు, మహానాడు: నగరపాలక సంస్థ పరిధిలోని చెరువులు, వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. సోమవారం కమిషనర్ సమ్మర్ పేట చెరువుని స్థానిక కార్పొరేటర్ బి.స్మిత పద్మజ, అధికారులతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని చెరువు కట్టలను ప్రజలకు ఉపయోగపడేలా వాకింగ్ ట్రాక్ లుగా అభివృద్ధి చేస్తామన్నారు. సమ్మర్ పేట చెరువులో కట్ట ఏర్పాటు చేశామని, త్వరలో ఫెన్సింగ్ పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు.
చెరువు విస్తీర్ణం సమగ్రంగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. నగరంలో చెరువులు ఆక్రమణలు జరగకుండా వార్డ్ సచివాలయాల వారీగా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు. సమ్మర్ పేట చెరువులో డ్రైనేజి నీరు కలుస్తుందన్న స్థానికుల ఫిర్యాదు మేరకు పరిశీలించి, చెరువులో డ్రైనేజి కలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో అసిస్టెంట్ సీటీ ప్లానర్ మురళి, డీఈఈ హనీఫ్, ఎస్ఎస్ సోమశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్ డేవిడ్, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.