– ఇదీ వైసీపీ అయిదేళ్ళ పాలన
– వైసీపీ ఎమ్మెల్సీ తమ్ముడు, అనుచరుల గుప్పట్లో దళితుల భూములు
– టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టిన పోలీసులపై చర్యలకు వినతి
– చెరువును కబ్జాచేసి అక్రమ లేఅవుట్ లు వేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
– ఇంకా దోపిడీ, కబ్జాదారులకు అధికారుల సహకారాలు… గ్రీవెన్స్ లో ఫిర్యాదు
– అర్జీదారుల నుండి వినతులు స్వీకరించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
మంగళగిరి, మహానాడు: గత అయిదేళ్ళ వైసీపీ పాలనలో భూములు కబ్జా చేశారని, ఇటువంటి దోపిడీదారులకు, అక్రమార్కులకు అధికారులు ఇంకా కొమ్ముకాస్తున్నారని.. వారి అన్యాయాలను అరికట్టి తమ భూములను విడిపించి తమకు న్యాయం చేయాలని బాధితులు మొరపెట్టుకున్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), మంత్రి వాసంశెట్టి శుభాష్, ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ లకు అర్జీదారులు వినతులు అందించి తమ గోడును చెప్పుకున్నారు. అర్జీలు స్వీకరించిన నేతలు సమస్యలపై సంబంధిత అధికారులు, కలెక్టర్లు, నేతలకు ఫోన్లు చేసి సమస్యలను తెలియపరిచి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
• వైసీపీ నేతలు తనకు వారసత్వంగా వచ్చిన భూమిని కబ్జా చేసి ఇబ్బంది పెడుతున్నారని తిరుపతికి చెందిన మల్లికార్జునరావు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు. వైసీపీ నేతల భూ కబ్జాపై కోర్టుకు వెళితే తనకే సానుకూలంగా తీర్పు వచ్చిందని… గతంలో వైసీపీ ప్రభుత్వ అండ చూసుకొని ఆ పార్టీ నేతలు భూమిని ఆక్రమించారని తనకు న్యాయం చేయాలని నేతల ముందు మల్లికార్జునరావు కోరారు.
• కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం లక్ష్మీపురం గ్రామంలో ఆమదాల చెరువుకు సంబంధించిన దాదాపు ఐదు ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించి నాటి వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడులు అక్రమ లేఅవుట్ లు వేశారని రావులపాలెం తెలుగు యువత అధ్యక్షుడు కోట చంద్రశేఖర్ గ్రీవెన్స్ లో నేతలకు ఫిర్యాదు చేశారు. దీనిపై గతంలో ఏపీ సీసీఎల్ వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. చెరువు ఆక్రమణపై చర్యలు తీసుకోకుండా జగ్గిరెడ్డి అడ్డుకున్నారని… చెరువులో అక్రమ లేఅవుట్ లకు కారకుడైన జగ్గిరెడ్డి, అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
• వైసీపీ హయాంలో టీడీపీ నేతలను అసభ్యంగా తిడుతూ.. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పోలీసు అధికారి మల్లికార్జున గుప్తాపై చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా నంద్యాలకు చెందిన జేవీ మనోహర్ రెడ్డి గ్రీవెన్స్ లో నేతలకు ఫిర్యాదు చేశారు.
• గత ప్రభుత్వం కళాకారులను విస్మరించిందని.. గుర్తింపు కార్డుల కోసం నాడు ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని దయ చేసి పేద కళాకారులను గుర్తించి, తమకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖచే ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇప్పించవలసిందిగా పలువురు కళాకారులు గ్రీవెన్స్ లో వేడుకున్నారు.
• 1988 లో 40 దళిత కుటుంబాలకు మంజూరు చేసిన 63 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి తమ్ముడు జెడ్‌పీటీసీ దేవసాని సత్యనారాయణరెడ్డి 27 ఎకరాలు.. ఎమ్మెల్సీ అనుచరులు మిగిలిన భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకోని సాగుచేస్తున్నారని.. పొలం దగ్గరకు వెళితే అనరాని మాటలు అంటూ బెదిరిస్తున్నారని ఎమ్మార్వో, ఎంపీడీవో, కలెక్టర్ల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని కడప జిల్లా శ్రీ కాశినాయన మండలం సావిశెట్టిపల్లె గ్రామానికి చెందిన బాధితులు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
* బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళితే తన భూమిని ఆక్రమించారని.. దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారని తన భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోని తన భూమిని తనకు ఇప్పించాలని గుంటూరు జిల్లా కాకుమాను మండలానికి చెందిన చల్లగిరి అంకమ్మరావు గ్రీవెన్స్ లో ఆవేదన వ్యక్తం చేశారు.
• నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ నేతల ప్రోద్భలంతో సీఐ విజయ్ భాస్కర్, ఎస్సై పి. నాగార్జునలు తనపై అక్రమ కేసులు పెట్టి రౌడీ షేట్ ఓపెన్ చేశారని… చిత్రహింసలు పెట్టి వేధించారని.. తాను టీడీపీ కోసం పనిచేస్తున్నాన్న కోపంతోనే తనపై అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారని నంద్యాల జిల్లాకు పగిడ్యాల మండలం కె.మచ్చుమర్రి గ్రామానికి చెందిన కాటం చిన్ననాగన్న గ్రీవెన్స్ లో నేతల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అక్రమ కేసులను తొలగించాలని వేడుకున్నారు.
• తన కూతురు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం ఓ మెడికల్ అకాడమీలో చేరిందని అక్కడ ఫుడ్ పడక జ్వరం రావడం.. ఆరోగ్య పరిస్థితి భాగలేకపోవడంతో మధ్యలో మానుకోవాల్సి వచ్చిందని.. అప్పటికే రూ. 50,500 ఫీజు కట్టామని మొత్తం ఫీజు కడితే కాని సర్టిఫికేట్లు ఇవ్వమని చెబుతున్నారని.. తన కూతురికి ఎంఈఎస్‌టీ కౌన్సిలింగ్ ఉందని.. డబ్బులు కట్టుకోలేని పరిస్థితి అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి సమస్యను గుంటూరుకు చెందిన గడ్డం వెంకటేశ్వర్లు తీసుకెళ్లగా వెంటనే కేంద్రమంత్రి ఆ అకాడమీ నిర్వాహకులకు ఫోన్ చేసి విద్యార్థిని సర్టిఫికేట్లు ఇచ్చేలా అకాడమి వారితో ఫోన్ లో మాట్లాడారు.
• తీసుకున్న అప్పును తిరిగి కడతామని చెప్పినా.. పోలీస్ స్టేషన్ కు పిలిపించి తన కొడుకును తీవ్రంగా కొట్టి చంపారని.. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం జంగంపల్లికి చెందిన మాదినేని రామంజినమ్మ గ్రీవెన్స్ లో ఆవేదన వ్యక్తం చేశారు. తమ కొడుకు చావుకు కారకులపై పుట్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. తన కొడుకు చావుకు కారణమైన వారిని శిక్షించాలని ఆమె గ్రీవెన్స్ లో తన ఆవేదన వ్యక్తం చేశారు.
• కడప జిల్లా కాశినాయన మండలం సావిశెట్టిపల్లె గ్రామ ఎస్సీ కులస్తులు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేస్తూ.. శ్మశానం లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. రోడ్డు పక్కన వంకల్లో శవాలను పూడ్చుకోవాల్సి వస్తోందని తమకు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని శ్మశానంకు కేటాయించి తమ ఇబ్బందులు తొలగించాలని వారు గ్రీవెన్స్ లో నేతల ముందు వేడుకున్నారు.
• విజయవాడ భవానీ పురం వెల్డింగ్ వర్కర్స్ యజమానుల సంక్షేమ సంఘం సభ్యులు నేతలకు విజ్ఞప్తి చేస్తూ.. ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమిని గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చేందుకు ఏపీఐఐసీ సమ్మతించినా తరువాత వచ్చిన వైసీపీ దాన్ని పట్టించుకోలేదని.. ఎన్నిసార్లు నేతలు, అధికారులు చుట్టూ తిరిగినా తమ సమస్యను వినలేదని.. ఆగిపోయిన ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును ప్రారంభించాలని సంఘ అధ్యక్షులు మధురాంతకం శ్రీనివాసరావు గ్రీవెన్స్ లో వేడుకొన్నారు.
అనేక మంది భూ కబ్జా బాధితులతో పాటు గత పాలనలో అర్హులైనా తమకు పింఛన్ లు రాలేదని కొందరు లబ్ధిదారులు పింఛన్ ల కోసం గ్రీవెన్స్ కు రాగా.. ఉద్యోగాలు కల్పించాలంటూ నిరుద్యోగులు, ఆరోగ్య సమస్యల దృష్ట్యా సీఎంఆర్ఎఫ్ అందించి ఆదుకోవాలని పలువురు గ్రీవెన్స్ లో వినతులు అందించారు. మరికొందరు చదువుల కోసం సాయం అర్థించగా.. చేసిన పనులకు బిల్లులు ఇప్పించాలని పనులు చేసిన కాంట్రాక్టర్లు వేడుకున్నారు. తమకు సరైన టైం స్కేల్ వర్తింప చేయడంలేదని మరికొంత మంది నాన్ టీచింగ్ ఉద్యోగులు గ్రీవెన్స్ లో మొరపెట్టుకున్నారు.
పదవులకోసం పోటెత్తిన నేతలు
పార్టీ కోసం కష్టపడిన నేతలు పదవులను ఆశిస్తూ పోటెత్తారు. తాము పార్టీకోసం చేసిన పనిని గుర్తించి తగిన పదవిని ఇచ్చి గౌరవించాలని రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన నేతలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాశ్రీనివాసరావు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడులకు తమ వినతులను అందించారు. వారి నుండి వినతులను స్వీకరించిన నేతలు పార్టీకోసం కష్టపడిన వారి ఖచ్చితంగా గౌరవం దక్కుతుందని తగిన ప్రాధాన్యం ఉంటుందని వారికి భరోనా ఇచ్చి అర్జీలు స్వీకరించారు.