వైసీపీ తీర్థం పుచ్చుకున్న పోతిన మహేశ్

జనసేన పార్టీకి రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన పోతిన మహేష్‌ ఈ ఉదయం వైసీపీలో చేరారు. గుంటూరు పర్యటనలో ఉన్న జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు.

విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో, తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన మహేష్‌ జనసేనకు గుడ్ బై చెప్పారు.

జనసేనానని పవన్ కల్యాణ్ పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుడంటే నమ్మకం అని… భరోసా ఇచ్చేవాడు, భవిష్యత్తు మీద భద్రత కల్పించేవాడే నాయకుడని ఆయన అన్నారు. పవన్ కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలనుకుంటున్నారని విమర్శించారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎవరో అందరికీ తెలుసని… తాను ఆయన వైపు అడుగులు వేస్తానని అన్నారు.