• జగన్ రెడ్డి అసమర్థ పాలనతో రూ.1,29,503 కోట్ల నష్టం
• ట్రూ అప్, ట్రూ అప్ ఫ్యూయల్ అంటూ కొత్త పేర్లతో నడ్డివిరిగేలా వడ్డన
• ప్రజలపై రూ.32,166 కోట్ల భారం మోపారు
• దేశంలో తొలిసారిగా విద్యుత్ సంస్కరణలు ప్రవేశ పెట్టిన ఘనత సీఎం చంద్రబాబుదే
• మాజీ మంత్రి కేెఎస్ జవహర్
మంగళగిరి, మహానాడు: ఐదేళ్ల కాలంలో విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన జగన్ రెడ్డి మాపై విమర్శలాలు చేస్తారా? అని మాజీ మంత్రి కేెఎస్ జవహర్ అన్నారు. ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘జగన్ రెడ్డి అసమర్థ పాలనతో విద్యుత్ రంగంలో రూ.1,29,503 కోట్ల నష్టం వాటిల్లింది. ట్రూ అప్, ట్రూ అప్ ఫ్యూయల్ అంటూ కొత్త పేర్లతో వడ్డించిన ఛార్జీలతో రూ.32,166 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు.
ప్రజలను మోసం చేసి గద్దెను ఎక్కిన మీరు విద్యుత్ చార్జీలు పూర్తిగా తగ్గించేస్తానని మోసపూరిత హామీ ఇచ్చి.. నీ ఐదేళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత నీకే దక్కుతుంది. ఇప్పుడు విద్యుత్ చార్జీల పెంపుపై మాట్లాడటం సిగ్గుచేటు. జగన్ రెడ్డి హయాంలోనే 2022-23 సంవత్సరానికి సంబంధించి రూ.8,114 కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను డిస్కంలకు సమర్పించిన విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఏపీని స్వార్థపూరిత, ఆరాచక, అవినీతి పాలనతో నాశనం చేశారు. ఏపీ జెన్‌కో కేంద్రాల నుంచి కొనుగోలు చేయకుండా కమీషన్ల కోసం అధిక రేట్లకు కొనుగోలు చేసి విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు.
వైసీపీ ప్రభుత్వం అదనంగా ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో జగన్‌రెడ్డి చేసింది శూన్యం. పైగా గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏలను రద్దు చేశారు. పీపీఏలలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని కేంద్రం స్పష్టం చేసినా పెడచెవిన పెట్టారు. అదేవిధంగా సమయం, సందర్భంగా లేకుండా విద్యుత్ కోతలు విధించి ప్రజలను రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాడు. జగన్ రెడ్డి పాలనలో ఒక్క విద్యుత్ శాఖ అనే కాకుండా అని శాఖలు నాశనమయ్యాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తోందని జవహర్ అన్నారు. దేశంలో తొలిసారిగా విద్యుత్ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం చంద్రబాబుది. కూటమి ప్రభుత్వానికి వస్తున్న అదరణను చూసి ఓర్వలేకనే జగన్ రెడ్డి విషపూరిత రాజకీయాలు చేస్తున్నారని దుమ్మెత్తిపోశారు.