ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని ఆస్వాదిస్తాం
మచిలీపట్నం: ప్రజల సమస్యలను పరిష్కరించి వారి కళ్ళల్లోని ఆనందాన్ని ఆస్వాదిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.స్థానిక బృందావన థియేటర్ పక్కన గల నియోజకవర్గ టీడీపి కార్యాలయంలో ఆయన శనివారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా ఆలకించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుండి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆ రోజు ప్రత్యక్షంగా తమ సమస్యలను విన్నవించుకోవచ్చని, మిగతా రోజుల్లో తమ సమస్యలకు పార్టీ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.
నేడు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుండి మూడొందలకు పైగా అర్జీలను స్వీకరించామని, ఆయా సమస్యలపై సంబంధిత శాఖాధికారులతో చర్చించి, సమస్య తీవ్రతను బట్టి ప్రాధాన్యత క్రమంలో అర్జీదారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
అదేవిధంగా రానున్న రోజుల్లో మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి డివిజన్లో పర్యటిస్తామన్నారు. ఎంతోకాలంగా నగరవాసులను పట్టిపీడిస్తున్న డ్రైనేజీ, పారిశుద్ధ్యం సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో వచ్చే నెల మొదటి తేదీన ఉదయం 6 గంటల నుండి ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన రూ.4 వేల పింఛను జూలై 1న అందిస్తామని, ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు పెంచిన రూ 4 వేలను కలుపుకొని మొత్తం రూ.7 వేలు ఆ రోజున లబ్ధిదారులకు అందించనున్నట్లు తెలిపారు. అలాగే సూపర్ సిక్స్ పథకాలను దశలవారీగా అమలుపరుస్తూ అర్హులైన లబ్ధిదారులందరికీ అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బండి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ ఎంపీపీ నాగేశ్వరరావు, పార్టీ నాయకులు లంకె నారాయణ ప్రసాద్, మీనవల్లి నాగేశ్వరరావు, గోపు సత్యం, వెంకట్, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు