ప్రశాంత్ కిషోర్.. జన్ సురాజ్ పార్టీ

అక్టోబర్ 2న ప్రారంభం
పార్టీకి నాయకత్వం వహించను
పార్టీ సభ్యుల నుంచే నాయకులను ఎన్నుకుంటా
లక్ష మంది ఆఫీస్ బేరర్లతో తన పార్టీ ప్రారంభం
జన్ సూరాజ్ ప్రచారం సందర్భంగా ప్రశాంత్ కిషోర్

పాట్నా: బీహార్ వేదికగా మరో పార్టీ రాబోతోంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ‘జన్ సురాజ్’ పేరుతో పార్టీని స్థాపించబోతున్నట్లు ఆయన ఆదివారం వెల్లడించారు.

లక్ష మంది ఆఫీస్ బేరర్లతో తన పార్టీ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. పాట్నాలోని బాపు సభాఘర్‌లో జన్ సూరాజ్ ప్రచారం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2న పార్టీని ప్రారంభిస్తున్నామని చెప్పారు.
తాను జన్ సురాజ్ పార్టీకి నాయకత్వం వహించనని, పార్టీ సభ్యుల నుంచే నాయకులను ఎన్నుకుంటానని ఆయన చెప్పారు. మెరుగైన విద్య, ఉద్యోగాలు లేదా ఆరోగ్య సంరక్షణ కోసం బీహార్‌కు చెందిన తరువాతి తరం ప్రజలు, రాష్ట్రం వెలుపలకు వెళ్లకుండా ఉండేలా కృషి చేయాలని ప్రశాంత్ కిషోర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల కోసం మీరు కష్టపడాలని ప్రసంగంలో చెప్పారు. 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

పార్టీ నాయకత్వం గురించి మాట్లాడుతూ.. ఏడుగురు సభ్యుల కమిటీ ఆగస్టు 15 నుంచి 20 వరకు పార్టీలోని 25 అత్యున్నత పదవులకు ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కమిటీలో సమస్తిపూర్‌ నుంచి డాక్టర్‌ భూపేంద్ర యాదవ్‌, బెగుసరాయ్‌ నుంచి ఆర్‌ఎన్‌ సింగ్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ సురేశ్‌ శర్మ, సివాన్‌ నుంచి న్యాయవాది గణేష్‌ రామ్‌, తూర్పు చంపారన్‌ నుంచి డాక్టర్‌ నసీమ్‌, భోజ్‌పూర్‌ నుంచి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అరవింద్‌ సింగ్‌, ముజఫర్‌పూర్‌ నుంచి స్వర్ణలతా సాహ్ని ఉంటారని కిషోర్‌ తెలిపారు.