ఆగిన చిన్నతరహా ప్రాజెక్టుల పనులు ప్రారంభించాలి
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు భూములు గుర్తించండి
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశం
ఖమ్మంలో విద్య, సాగునీటి రంగాలపై సమీక్ష
విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లు మరో వంద పెంచనున్నట్లు వెల్లడి
ఖమ్మం: కలెక్టర్ కార్యాలయంలో విద్య, సాగునీటి పారుదల శాఖల ప్రగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురామిరెడ్డి, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రపంచంతో పోటీపడే విధంగా ఖమ్మం జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం పనిచేయాలని సూచించారు. వ్యవసాయాధారిత ఖమ్మం జిల్లాలో వ్యవసాయాన్ని బలోపేతం చేసుకోవడం వల్ల ఆర్థిక వనరులు పెరుగుతాయన్నారు. సాగునీరు అందించే ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకుందామని తెలిపారు. జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి, వాటికి కావాల్సిన నిధులు, పూర్తయ్యే గడువు తది తర అంశాలపై లోతుగా సమీక్ష చేసుకుందమని, జిల్లాలో ఉన్న మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎన్‌ఎస్పీ కెనాల్స్, సీతారామ ప్రాజెక్ట్, మధ్యతరహా, చిన్న తరహా పెండిరగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి క్యాలెండరు తయారు చేసుకుని ఆ ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళదామని పేర్కొన్నారు. మొదటగా ఆరు నెలలో పూర్తయ్య ప్రాజెక్టులు, ఏడాది లోపు పూర్తయ్యే ప్రాజెక్టు లు, రెండేళ్లలో పూర్తి చేసుకునే ప్రాజెక్టులకు సంబంధించి క్యాలెండర్ తయారు చేసుకుని నిర్ణిత గడువులోగా పూర్తయ్యేలా టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో కొన్నిచోట్ల చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఇప్పటికీ పనులు మొదలు కాని (ఉదాహరణకు పండ్రేగుపల్లి) ప్రాజెక్టుల పనులను సత్వరం ప్రారంభించేందుకు చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. జిల్లా నుంచి వృధాగా సముద్రంలోకి నీరు వెళ్లకుండా ప్రతినీటి బొట్టును ఒడిసి పట్టుకుని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
విద్యపై ప్రత్యేక ఫోకస్..ఏడాదిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్
ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజాపాలన ప్రభుత్వం విద్య పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. రాష్ట్ర బడ్జెట్లో ఎంత అవసరమైతే అంత నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర చరిత్రలోనే ప్రభుత్వ పాఠశాలల పునః ప్రారం భమైన మొదటి రోజున విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ఇచ్చాం. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మాణం చేయడానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నిధులు కేటాయించాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దేశానికి ఒక మోడల్‌గా అద్భుతంగా నిర్మాణం చేయనున్నాం. ఖమ్మం జిల్లాలో రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు వెంటనే భూముల ను గుర్తించి మ్యాపులను సంబంధిత అధికారులకు అందజేయాలి. ఏడాదిలోగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకుంది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ద్వారా అందిస్తున్న ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల సంఖ్యను మరో వందకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.