రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల

హైదరాబాద్‌, మహానాడు: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన రైతు హామీలు నెరవేర్చాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి రైతు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. దీక్షలలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.2 లక్షల రుణ మాఫీ, రూ.15 వేలు రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12 వేలు, వరికి క్వింటాలుకు రూ.500 బోనస్‌, పంట నష్ట పరిహారం ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని కోరారు. బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని అన్నారు. రైతులకు అండగా ఉన్నామనే భరోసా కల్పించేందుకే రైతు దీక్ష చేపడుతున్నామన్నారు. మోసగించిన కాం గ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ దీక్షలలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.