గాంధీ నడయాడిన పల్లెకు మంచినీరు సౌకర్యం కల్పించండి

– వరదలతో పంట నష్టపోయాం, పరిహారం అందించి ఆదుకోండి
– 32వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విజ్ఞప్తులు
– ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తుందని మంత్రి భరోసా

అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విని పరిష్కరించేందుకే ప్రజాప్రభుత్వం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా పరదాలు కట్టుకుని తిరగడం లేదని, కష్టాల్లో ఉన్న ప్రతిఒక్కరికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ 32వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మంత్రి లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు

వరదలతో పంట నష్టపోయాం
– కుంచనపల్లి, ప్రాతూరు ప్రాంత రైతులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. భారీ వర్షాలకు కుంచనపల్లి, ప్రాతూరు లంక పొలాలు నీటమునిగి తీవ్రంగా నష్టపోయామని, పొలాల్లోని ఆయిల్ ఇంజన్లు సైతం నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

– వరదలకు మంగళగిరి పట్టణం 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి నగర్ లో తమ ఇళ్ళల్లోకి నీరు చేరి, ఇంట్లోని వస్తువులు పాడైపోయాయని బాధితులు మంత్రి నారా లోకేష్ కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విధాల నష్టపోయిన తమకు ప్రస్తుతం కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని, తగిన ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

– వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యాపారం నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని, డిగ్రీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన ఆర్.సాయికుమారి విజ్ఞప్తి చేశారు.

– కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివిన తనకు ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని కాజకు చెందిన మాణిక్యాల సాయి కోరారు.

– తాడేపల్లి మండలం సీతానగరంలో గత 30 ఏళ్లుగా తన పేరుపై రిజిస్టరై ఉన్న ఇంటిస్థలాన్ని మేడా వెంకటేశ్వరరావు, అతని సోదరులు ఆక్రమించి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, విచారించి తగిన న్యాయం చేయాలని విజయవాడకు చెందిన హేమాద్రి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారికి మంత్రి హామీ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు

– గాంధీ మహాత్ముడు నడయాడిన గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఏ.ముప్పాళ్ల వాసి రాపర్ల జగన్నాథం మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. 10వేల జనాభా ఉన్న గ్రామంలో నీటికి ఇబ్బందులు పడుతున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ గ్రామంలో గాంధీ మూడు రోజులు బసచేశారని, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో భాగంగా తమ గ్రామానికి వచ్చినప్పుడు తులాభారం వేసినట్టు వివరించారు. అంతటి చారిత్రక నేపథ్యం ఉన్న తమ గ్రామానికి నాగార్జున సాగర్ కెనాల్ నుంచి పైప్ లైన్ ద్వారా నీటి వసతి కల్పించాలని కోరారు.

– రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంట్ కాంట్రాక్ట్ నర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిలి విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ ద్వారా రోస్టర్ పాయింట్ ఆధారంగా మెరిట్ లో ఎంపికై గత పదేళ్లుగా అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ, కోవిడ్-19 సేవలందించామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దాదాపు 15 ఏళ్ళుగా శాశ్వత ప్రాతిపదికన ఒక్క ఉద్యోగానికి కూడా నోచుకోలేదన్నారు. రెగ్యులర్ పోస్టు కోసం ఎదురుచూస్తున్న తమకు న్యాయం చేయాలని, అర్హత కలిగిన స్టాఫ్ నర్సులకు రెగ్యులర్ పోస్టులు ఇవ్వాలని కోరారు.

– టీడీపీ హయాంలో హోంగార్డు ఉద్యోగాలు పొంది వివిధ శాఖలలో విధులు నిర్వహిస్తున్న తమను అనంతరం వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో అప్పటి అధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారని చిత్తూరుకు చెందిన 87 మంది హోంగార్డులు మంత్రి నారా లోకేష్ కలిసి ఫిర్యాదు చేశారు. తిరిగి హోంగార్డు ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

– అల్లూరి సీతారామరాజు జిల్లా, వీఆర్ పురం మండలం కె.కొత్తగూడం గ్రామ రైతులు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు కింద సేకరించిన తమ భూములకు వచ్చిన నష్టపరిహారాన్ని ఫోర్జరీ సంతకాలతో అధికారులు స్వాహా చేశారని ఫిర్యాదు చేశారు. రీ సర్వే చేయడంతో పాటు నష్టపరిహారాన్ని రికవరీ చేసి వాస్తవ బాధిత రైతులకు భూపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

– గోదావరి డెల్టా సిస్టమ్ ధవళేశ్వరం సర్కిల్ పరిధిలో అవుట్ సోర్సింగ్ డైలీ వేజ్ లస్కర్లు పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు 10 నెలల వర్క్ ఆర్డర్ ను 12 నెలలకు పెంచాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా 15 నెలల పెండింగ్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

– వైసీపీ ప్రభుత్వ హయాంలో బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం రామాపురం గ్రామంలోని 230 మందిపై టీడీపీ సానుభూతిపరులనే నెపంతో అక్రమ కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదు చేశారు. మహిళలని కూడా చూడకుండా అప్పటి డీఎస్పీ, సీఐ, ఎస్ఐ చిత్రహింసలకు గురిచేశారని కన్నీటిపర్యంతమయ్యారు. తమపై నమోదుచేసిన అక్రమ కేసులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారందరికీ మంత్రి హామీ ఇచ్చారు.