కాంగ్రెస్‌ పాలనలో ఏనాడు పూజలను అడ్డుకోలేదు

ఇండియా కూటమి వస్తే ఇంటి పెద్ద ఖాతాలో డబ్బు
పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో భట్టివిక్రమార్క

పంజాబ్‌: కాంగ్రెస్‌ తన 55 ఏళ్ల పరిపాలనలో ఏనాడు పూజా కార్యక్రమాలను అడ్డుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం పంజాబ్‌ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కొట్కపుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిం చారు. సభకు ముందు ప్రధాన అతిథిగా విచ్చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు డిప్యూటీ సీఎం స్వాగతం పలికారు. కాంగ్రెస్‌ పేదల కోసం పనిచేస్తుంటే బిజెపి మాత్రం కొద్ది మంది పెద్దల కోసం పనిచేస్తుందని ధ్వజమెత్తారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఇంటి పెద్ద బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయల నగదు జమ చేస్తామన్నారు. జనాభా దామాషా ప్రకారం ఈ దేశ సంప ద, వనరులు పంపిణీ చేయడమే కాంగ్రెస్‌ లక్ష్యమని వివరించారు.