అర్హులందరికీ పక్కా ఇళ్ళు

– గృహ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక
– నిర్మాణానికి దాతల సాయం తీసుకోండి
– హౌసింగ్‌ అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని

గుంటూరు, మహానాడు: అర్హులైన ప్రతి పేదవానికి సొంతింటికల సాకారం చేయడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. గృహ నిర్మాణ స్కీంకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఈ నెల 21, 22 తేదీల్లో గుంటూరుకు ఆహ్వానిస్తున్నామని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని ఎంపీ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో పెమ్మసాని శుక్రవారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ గ్రామీణ యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో గృహ లబ్ధిదారుల సర్వే చేపట్టనున్నట్టు వెల్లడించారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో గృహ నిర్మాణానికి సంబంధించి అమలవుతున్న టెక్నాలజీస్, కాస్ట్ ఎఫెక్టివ్ టెక్నాలజీ పై చర్చించి నూతన విధానాన్ని తీసుకురావాలని చెప్పారు. గృహ నిర్మాణానికి దాతల సాయం తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు ఎంపికలో పూర్తి పారదర్శక పాటించాలని సూచించారు.

కార్యక్రమంలో ఏపీ గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజబాబు, చీఫ్ ఇంజనీర్ జయ రామాచారి, సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రసాద్, జిల్లా హౌసింగ్ హెడ్ శంకర్రావు, డివిజన్ హెడ్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.