‘పులస’కారిపోతోంది గురూ…

-గోదావరి జిల్లాల్లో పులస చేపల సందడి
-ఎర్ర నీరు వస్తుండడంతో పులస చేపల రాక మొదలు
-కోనసీమ జాలరికి చిక్కిన పులస
-రూ. 24 వేలకు కొనుగోలు చేసిన మాజీ సర్పంచ్
(జయరాజ్)

‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి.. దీని తస్సా దియ్యా…ఈ చేప లో ఏముందో ఏమో కాని విశేషం….24 వేల రూపాయలు పలికిన కేజిన్నర చేప! వానాకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో సరికొత్త సందడి మొదలవుతుంది. పులస చేపల కోసం వేట మొదలవుతుంది. ఒక్క చేప అయినా వలలో పడితే ఇక పండుగే.

వేల రూపాయల ధర పలికే ఈ చేపకు ఇంత భారీ ధర పలకడానికి కారణం దాని రుచే. గోదావరికి ఎదురు ఈదుతూ వచ్చే ఈ చేపను జీవితంలో ఒక్కసారైనా తినాలని అనుకోని వారుండరు. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అన్న సామెత ఎలానూ ఉంది.

తాజాగా గోదావరికి ఎర్రనీరు వస్తుండడంతో ఓ జాలరి వలలో పులస చిక్కింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో మకిలిపురం మండలం రామరాజులంక జాలర్ల వలలో దాదాపు కేజిన్నర బరువున్న పులస చేప పడింది. ఆ వెంటనే దానిని మాజీ సర్పంచ్ బర్రే శ్రీను రూ. 24 వేలకు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. పులస చేపా.. మజాకా!