పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
గుంటూరు, మహానాడు: సాంఘిక సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి మంచి మార్కులతో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్ధులకు తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం ఉదయం తాడికొండ లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, బీసీ బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు.
ముందుగా సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం తయారు చేసే వంట గది మరియు డైనింగ్ హాల్ ను పరిశీలించి తగు సూచనలు చేశారు. విద్యార్థులకు అందించే అల్పాహారం, భోజనం మెనూ ప్రకారం రుచిగా, సుచిగా అందించాలన్నారు. తరగతి గదులను పరిశీలించి వారికి అందిస్తున్న విద్యాభోదనపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
పదవ తరగతి విద్యార్ధులతో మమేకమై జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయురాలిగా మారి కొంత సమయం వారితో ముచ్చటించారు. ఇంగ్లీష్ పాఠ్య పుస్తకం చదవడం లో విద్యార్ధికి వున్న ప్రతిభను పరీక్షించారు. విద్యార్ధులకు రోజు వారీగా పాఠ్య పుస్తకంలోని పాఠాన్ని చదివించాలని, అలాంటప్పుడే విద్యార్ధులు మంచి తర్ఫీదు పొందగలరని ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ సూచించారు. పాఠ్య పుస్తకాన్ని చదవడం లోనే విద్యార్ధులు ఇబ్బందులు పడితే, ఆ పాఠాన్ని వారు అర్ధం చేసుకొని పరీక్షలను ఎలా ఎదుర్కొగలరని జిల్లా కలెక్టర్ తెలిపారు. విద్యార్ధుల్లో స్టాండర్డ్ పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉందని సూచించారు.
అనంతరం ఐదవ తరగతి చదువుతున్న విద్యార్ధులతో వారికి లెక్కల పై ఏ మాత్రం అవగాహన ఉందో తెలుసుకోవడానికి వారిని పరీక్షించారు. ఇంతకు క్రితమే అభ్యాసం పూర్తైన లెక్కల చాప్టర్ నుండి బోర్డ్ పై లెక్కను రాసి పరిష్కరించాల్సిందిగా విద్యార్ధులను కొరారు. విద్యార్ధులు లెక్క పరిష్కారంలో తడబాటు పడటం చూసి విద్యార్ధులకు మరింతగా తర్ఫీదు ఇవ్వాలని గణిత ఉపాధ్యాయునికి సూచించారు. విద్యార్ధులు ఏయే సబ్జెక్ట్ లలో వెనుకబడి ఉన్నారో గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని అందించాలన్నారు.
బాలుర గురుకుల పాఠశాల ప్రాంగణంలో నిల్వ వున్న వర్షపు నీటిలో లార్వ పెరగకుండా ఉండేందుకు ఆయిల్ బాల్స్, యాంటీ మలేరియా మందులు వేసి మలేరియా వంటి జబ్బులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పరిసర ప్రాంతాల్లో ఫాగింగ్ చేయాలని పంచాయతీ సెక్రెటరీని ఆదేశించారు. విద్యార్ధులు బస చేసే గదులను, టాయిలెట్లను పరిశీలించి, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. బస చేసే గదుల్లోకి దోమలు, ఈగలు వంటి కీటకాలు ప్రవేశించకుండా వుండేందుకు కీటికిలకు మెష్ లను వెంటనే ఏర్పాటు చేయాలని తెలిపారు.
అనంతరం బీసీ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. వసతి గృహం లోని విద్యార్ధులతో మాట్లాడారు. వారికి అందిస్తున్న ఆహారం ఎలా ఉందని, సమయానికి ఆహారం అందిస్తునారా అని ఆరా తీశారు. వంట గదిని పరిశీలించి మరింత శుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహం నుండి బయటకు వెళ్ళే డ్రైనేజి వ్యవస్థ సరిగా లేదని వసతి గృహం అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా డ్రైనేజిని బాగు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఈఓ పిఆర్‌డి వెంకటేశ్వర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వసతి గృహంలో మరింతగా పారిశుద్ద్యం పనులు చేపట్టి విద్యార్థినీలకు సౌకర్యవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ వసతి గృహాల తనిఖీలో జిల్లా కలెక్టర్ తో పాటు డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పి.శ్రీకర్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదన్, తాడికొండ తహశీల్దార్ మధుసూదనరావు, మండల ప్రత్యేక అధికారి, పరిశ్రమల శాఖ ఉప సంచాలకులు సుధాకర్, గురుకుల పాఠశాలల జిల్లా కో-ఆర్డినేటర్ కె.పద్మజ, సమగ్ర శిక్ష అడిషనల్ కో-ఆర్డినేటర్ జి.విజయ లక్ష్మీ, మండల విద్యా శాఖ అధికారిణి ఇందిరా తదితరులు పాల్గొన్నారు.