– కలెక్టర్ నాగలక్ష్మి
గుంటూరు, మహానాడు: ప్రతి పేదవానికి నాణ్యమైన ఆహారం నామమాత్రపు ధరకే అన్న క్యాంటీన్లలో లభిస్తుందని, మరింత మంది ఆకలి తీర్చడానికి దాతలు ముందుకు రావాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ కోరారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని పల్నాడు బస్టాండ్ వద్ద శుక్రవారం అన్న క్యాంటీన్ ను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎంఎల్ఏ గల్లా మాధవిలతో కలిసి కలెక్టర్ పునఃప్రారంభించారు. అనంతరం కమిషనర్ తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ నసీర్ అహ్మద్ తో కలిసి నల్లచెరువు మెయిన్ రోడ్ లోని క్యాంటీన్ ను, ప్రత్తిపాడు ఎంఎల్ఏ బి.రామాంజనేయులు, తాడికొండ ఎంఎల్ఏ తెనాలి శ్రావణ్ కుమార్ లతో కలిసి ఆర్.టి.ఓ. ఆఫీస్, ఐడి హాస్పిటల్ వద్ద క్యాంటీన్లను పునఃప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేవలం రూ.15 తో 3 పూటలా కడుపు నింపుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించారన్నారు. గుంటూరు జిల్లాలో జిఎంసి పరిధిలో 7, మంగళగిరి – తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో 3, తెనాలి మున్సిపాలిటీ పరిధిలో 3 క్యాంటీన్లను శుక్రవారం పునః ప్రారంభం చేస్తున్నామన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతి రోజు నిర్దేశిత మెనూ ప్రకారం ఆహార పదార్ధాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, ఎస్.ఈ. శ్యాం సుందర్, ఎంహెచ్ఓ మధుసూదన్, ఈఈలు సుందర్రామిరెడ్డి, కొండా రెడ్డి, కోటేశ్వరరావు, శ్రీనివాస్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.