అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు

మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష 

హైదరాబాద్, మహానాడు :  అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై అధికారుల నుంచి నివేదిక కోరారు.

నాణ్యత లేని గుడ్లు, వస్తువులు సరఫరా అయితే వాటిని అంగన్వాడీ కేంద్రాలు తిరస్కరించాలని సూచించారు. లేనిపక్షంలో సంబంధిత అంగన్వాడీ టీచర్లు, స్థానిక అధికారులను బాధ్యుల్ని చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నాసిరకం వస్తువులను సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వస్తువుల సరఫరా కాంట్రాక్టులను గత ప్రభుత్వం రెండేళ్లకు పొడిగించడం వల్ల కొందరు కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

కాంట్రాక్టుల గడువును తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో వస్తువుల క్వాలిటీ చెక్ చేసేందుకు జిల్లాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. నాణ్యతలేని గుడ్లు పంపిణీ చేస్తే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.  అంగన్వాడి కేంద్రాల్లో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు.