అన్నక్యాంటీన్లకు సంబంధం లేకుండానే కొత్త ప్రయోగం
– దాతల సాయంతో అన్న క్యాంటీన్ల తరహా క్యాంటీన్లు
– గ్రామీణ ప్రాంతాల్లో గాంధీజయంతి నాటికి క్యాంటీన్లు
-ప్రతిరోజూ 200 మంది పేదలకు ఉచిత భోజనం
– దటీజ్..రఘురామకృష్ణంరాజు
ఉండి: ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు రూటే సెపరేటు. ఆయన ఏం చేసినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆదరణ లభిస్తున్న అన్న క్యాంటీన్, ఆయన ఉండి నియోజకవర్గ పరిథిలో లేదు. దానితో అప్పటివరకూ వేచిచూడకుండా.. తన నియోజకవర్గ ప్రజల కోసం తానే ఒక క్యాంటీన్‌కు నడుంబిగించారు. రోజుకు 200 మందికి ఉచిత భోజనం కోసం ప్రణాళిక రూపొందించారు. తన వ్యక్తిగత నిధులు-దాతల సాయంతో ఈ క్యాంటీన్‌ను, గాంధీజయంతి నాటికి ప్రారంభించాలన్నది తన ఆలోచన అని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
ఇంకా రఘురామకృష్ణంరాజు ఏమన్నారంటే..
పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలన్న అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ల ప్రారంభించారని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గత ఐదేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ఆనవాళ్లు లేకుండా చేయడానికి మూసి వేయడమే కాకుండా, స్ట్రక్చర్లను ధ్వంసం చేసిందని విమర్శించారు. మళ్లీ అన్నా క్యాంటీన్లను పునర్నిర్మించుకొని, ధ్వంసమైనచోట కొత్త స్ట్రక్చర్లను నిర్మించి స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా తిరిగి వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారని తెలిపారు. ప్రస్తుతానికి 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించినప్పటికీ, రానున్న 45 రోజులలో మరో 103 నుంచి 105 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్ల కేవలం పట్టణ ప్రాంతాలలో మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు.
ఉండి నియోజకవర్గ పరిధిలో ఒక చిన్న మునిసిపాలిటీ మాత్రమే ఉంది. స్థానికంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ ను కోరాను. ప్రస్తుతానికి అన్నా క్యాంటీన్ల జాబితాలో ఉండి నియోజకవర్గం పేరు లేదు. ఉండి నియోజకవర్గాన్ని కూడా అన్నా క్యాంటీన్ల జాబితాలో చేర్చాలని మంత్రి నారాయణను కోరాను. క్యాంటీన్ నిర్వహణకు అయ్యే ఖర్చులో 60 శాతం తామే భరిస్తామని మంత్రికి వివరించాను.
మధ్యాహ్న భోజనానికి దాతల ద్వారా విరాళాలను స్వీకరించి పేదలకు ఉచితంగానే అన్నదానాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించాను. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు, పెళ్లిరోజు, తమ తల్లిదండ్రుల పుట్టినరోజు, తాత ముత్తాతల వర్ధంతి రోజు అన్నదానానికి అవసరమైన డబ్బును భరిస్తే, వారి పేరిట అన్నదాన కార్యక్రమాన్ని చేపడతామని మంత్రికి వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
గ్రామీణ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ల స్ఫూర్తితో క్యాంటీన్ల ఏర్పాటు
అన్నా క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు ప్రొవిజన్ లేకపోవడంతో, సొంతంగా క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అన్నా క్యాంటీన్ల మెనూకు ఏమాత్రం తగ్గకుండా ఆకలితో అలమటించే పేదవారి కడుపు నింపేందుకు గ్రామీణ ప్రాంతమైన ఉండి నియోజకవర్గ పరిధిలోను రెండు నుంచి మూడు ప్రాంతాలను ఎంపిక చేసి క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మేజర్ గ్రామపంచాయతీలలో అన్నా క్యాంటీన్ లో ఏర్పాటు ప్రొవిజన్ లేదని, అందుకే సొంతంగా స్థానిక ప్రజల సహాయ సహకారాలతో దాతలు, మిత్రుల అండదండలతో అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి నాటికి క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
అన్నా క్యాంటీన్ పేరును ఉపయోగించడానికి లేదని, ఆ పేరును ఉపయోగిస్తే అన్నా క్యాంటీన్ మెనూ అమలు చేయాల్సి ఉంటుందన్నారు. అన్నా క్యాంటీన్ల ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి కి 500 మంది పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందజేస్తారన్నారు. అయితే గ్రామీణ ప్రాంతంలో రాత్రిపూట ఎవరు భోజనానికి వచ్చే అవకాశం ఉండదని పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు, మధ్యాహ్నం 200 మందికి ఉచితంగా భోజనం అందజేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరికి పుట్టినరోజు, పెళ్లిరోజు అన్నది సర్వసాధారణం. అలాగే పుట్టిన వారు గిట్టక తప్పదు కాబట్టి తాము ప్రేమించే తల్లిదండ్రుల, తాత, ముత్తాతలను సంస్మరణార్థం వారి వర్ధంతి రోజులలో అన్నదాన కార్యక్రమానికి చేయూతనివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని దానాలలో కెల్లా అన్నదానం ఎంతో శ్రేష్టమైనదని పేర్కొన్న ఆయన, అందుకే దేవాలయాలలో, ఇతర ప్రార్ధనా మందిరాలలో అన్నదానానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు.
దేశంలోని సిఖ్ ల గురుద్వారాలలో అన్నదాన కార్యక్రమం ఒక మహా యజ్ఞంలా కొనసాగుతోందని, ఆకలితో అలమటించే ఏ మతస్తుడైన అక్కడికి వెళితే భోజనం పెడతారన్నారు. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడం మన జాతి సంస్కృతి అని పేర్కొన్న రఘురామ కృష్ణంరాజు, అది మన సాంప్రదాయమని వెల్లడించారు. 200 మందికి అన్నదానం చేస్తే రోజుకు 10 వేల రూపాయలు ఖర్చు అవుతుందని, నెలకు మూడు లక్షలు, సంవత్సరానికి 36 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు.
ఇలా… తమ పుట్టినరోజు, పెళ్లిరోజుతోపాటు , తమకిష్టమైన వారి సంస్మరణార్థం అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఎంతోమంది ముందుకు వస్తారని ఆశా భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఉండి, ఆకివీడు, మొగళ్లు మేజర్ గ్రామపంచాయతీల పరిధిలో క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ప్రతిరోజు 200 మంది పేదవారికి అన్నదానం చేస్తే పదివేల రూపాయలు ఖర్చవుతుందన్న ఆయన , ఆ పదివేల రూపాయల ఖర్చును భరించే వారి పేరిట అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతామన్నారు.
క్యాంటీన్ ప్రాంగణంలో ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటుచేసి అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టే వారి ఫోటోలతో పాటు, వారి కుటుంబ సభ్యుల ఫోటోలను ఒక సంకలనం గా రూపొందించి ప్రదర్శించడం జరుగుతుందన్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఒక వీడియో గా మా ఆఫీస్ సిబ్బంది చేత షూట్ చేయించి, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన వారికి పంపించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. దీనితో, తాము వెచ్చిస్తున్న డబ్బులు సద్వినియోగమయ్యాయన్న తృప్తి వారికి కలుగుతుందన్నారు.
పేదవారికి, తినడానికి అన్నం లేని వారి ఆశీర్వాదం ఎంతో పవర్ఫుల్, అన్నదానం చేసిన వారికి వారి ఆశీర్వాదాలు ఉంటాయని తెలిపారు. ఒక మంచి పని చేశామన్న సంతృప్తి తో పాటు, తమ ప్రాంతం వారికే భోజనాన్ని పెట్టామన్న ఆత్మసంతృప్తి కలుగుతుందని తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో దాతలకు కొదవలేదు. దాతలంతా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
రద్దీగా ఉండే ప్రాంతాలలో క్యాంటీన్ల ఏర్పాటు
ఉండి నియోజకవర్గ పరిధిలోని రద్దీగా ఉండే ప్రాంతాలలో క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. అన్నదానం చేయాలనుకునేవారు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, అన్నదానానికి 10 రోజుల ముందుగానే డబ్బులు చెల్లించాలన్నారు. లేకపోతే వెయిటింగ్ లిస్టులో ఉన్న మరొకరికి ఆ స్లాట్ కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఉండి, పాలకోడేరులలో తప్పనిసరిగా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలి.
ఆకివీడులో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయవచ్చు. లేకపోతే మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఐ భీమవరానికి చెందిన సత్యనారాయణ రాజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఈరోజు వరకు అన్నదానాన్ని కొనసాగిస్తున్నారు . క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు కొనసాగిస్తానని చెప్పారు.
క్యాంటీన్ ఏర్పాట్లకు ఒక విధంగా సత్యనారాయణ రాజు కూడా మనకు స్ఫూర్తి. దాతలు ఉన్నప్పుడు క్యాంటీన్ల నిర్వహణ పెద్ద కష్టమేమీ కాదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గ్రామీణ ప్రాంతమైన ఉండి నియోజకవర్గం ప్రజలు, దాతృత్వంలో పట్టణ ప్రాంతాల వారికి ఏమాత్రం తీసి పోరని తెలిపారు. స్థానికులే కాకుండా, ఇతర ప్రాంతాలకు చెందిన మనసున్న వారి వద్ద నుంచి కూడా క్యాంటీన్ల నిర్వహణ కోసం అవసరమైతే నిధులను సేకరించడం జరుగుతుందన్నారు.
ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి ఒక వేదికగా ఉంటూ అవసరమైతే డబ్బులను ఖర్చు చేయనున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. మన సంకల్పం మంచిదైతే ప్రపంచమంతా మనతోనే ఉంటుందన్న ఆల్ కెమిస్ట్ అనే ఒక ఆంగ్ల నవల కథాంశాన్ని నేను నమ్ముతానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
ఇప్పటివరకు నేను చేపట్టిన కార్యక్రమాలన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతున్నాయని తెలిపారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలన్న చంద్రబాబు నాయుడు ఆలోచనలలో నుంచి పుట్టిన క్యాంటీన్ల నిర్వహణ అన్న ఐడియా ను, ఉండి నియోజకవర్గంలో అమలు చేస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
మూడు నెలల్లో గంజాయి భూతాన్ని అరికడతా
ఉండి నియోజకవర్గ పరిధిలో రానున్న మూడు నెలల వ్యవధిలో గంజాయి భూతాన్ని అరికడతానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ముందు గంజాయి ఎక్కడినుంచి సరఫరా అవుతుందని సమాచారాన్ని కనిపెట్టాలన్నారు. ఇదొక పెద్ద రాకెట్, వీరు ఎవరినైనా ఇట్లే కొనుగోలు చేయగలరన్నారు. శాసనసభ్యులు కూడా గంజాయిని అరికట్టడానికి పోలీసు ఉద్యోగం చేయాలని ఆయన పేర్కొన్నారు.
గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు ఉక్కు పాదం మోపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి కోరుతానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు గంజాయి అన్నదే పెద్ద సమస్యగా మారిందని ఆయన పేర్కొన్నారు. గంజాయి మత్తులో ఉచ్చం, నీచం మరిచి ఒకడు ఆవు పొదుగును కోయగా, మరొకడు గేదెను రేప్ చేశాడంటే ఆడవారు కనిపిస్తే వదులుతారా అని ఆందోళన వ్యక్తం చేశారు.
పసి పిల్లలపై కూడా గంజాయి మత్తులోనే హత్య, హత్యాచారాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కొంత పోలీసుల సహకారంతోనే గంజాయి సరఫరా జరుగుతోందన్నది నా నిశ్చితాభిప్రాయమని తెలిపారు. స్కూళ్ల వద్ద బడ్డీ కొట్టులు ఏర్పాటుచేసి, ఆ బడ్డి కొట్టు ల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇటీవల విచారిస్తే రాత్రిళ్లు స్మశానాలను కేంద్రంగా చేసుకొని గంజాయిని సేవిస్తున్నట్లుగా తెలుస్తోందని, స్మశానాల వద్ద గంజాయిని సేవించి ఇంటికొచ్చే దారిలో అత్యాచారాలను జరుపుతున్నారన్నారు. ఇటీవల గంజాయి మత్తులో ఒక వ్యక్తిని హత్య చేసి రైల్వే ట్రాక్ పై వేశారని గుర్తు చేశారు. పోలీసులు తలుచుకుంటే గంజాయి సరఫరాను అడ్డుకోగలరని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత లు గంజాయి సరఫరాను కట్టడి చేయగలరన్న ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.
ఉండి నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పోస్టులు భర్తీ చేసిన వెంటనే గంజాయి సరఫరా, విక్రయంపై డేగ కన్ను వేసి కఠిన చర్యలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేస్తానని చెప్పారు. స్మశానాలతో పాటు ఖాళీ లేఅవుట్లు, రైల్వే ట్రాక్ లు అడ్డగా మార్చుకొని గంజాయి సరఫరా చేస్తుండగా, దాన్ని సేవించేవారు అక్కడికి చేరుకుంటున్నారని తెలిపారు. ఒక శాసనసభ్యుడిగా గంజాయి ని అరికట్టే బాధ్యతను పూర్తిగా పోలీసుల మీదే వదిలి వేయకుండా, అవసరమైతే నేను ఒక ప్రైవేట్ టీం ఏర్పాటు చేసి, సేవించే వారిని, విక్రయించే వారిని పట్టిస్తాను.
ఈ ప్రైవేట్ టీం సభ్యులు గంజాయి సేవించే బ్యాచ్ తో కలిసిపోయి సమాచారాన్ని అందిస్తారన్నారు. పోలీస్ స్టేషన్లో సరిపోను సిబ్బంది లేరని… సిబ్బంది లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. గంజాయి అనే భూతాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. భీమవరం శాసనసభ్యుడి తో కూడా ఈ విషయమై చర్చిస్తాను. ఉండి నియోజకవర్గం భీమవరం చుట్టూ ఉందని , భీమవరం, పాలకోడేరు వేరువేరు పోలీస్ సర్కిళ్లు అయినప్పటికీ, ఇద్దరితో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇంట్లో కూడా కొంతమంది గంజాయి మొక్కలను పెంచుతున్నట్లుగా తెలిసిందన్నారు. ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూలంకషంగా ఈ విషయాలపై చర్చించనున్నట్లు తెలిపారు. అంతకుముందే గంజాయిని అరికట్టడానికి మనం ఏం చేశామన్నది ముఖ్యమని పేర్కొన్న ఆయన, గంజాయిని సేవించేవారు, విక్రయించే వారు ఎవరైనా పార్టీలకతీతంగా వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలను ఇస్తానని తెలిపారు.
ఒక్కొక్కటిగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం
ఉండి నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 25 రోజుల వ్యవధిలో ఉండి పట్టణ కేంద్రంలోని అబ్బయ్య రాజు పార్క్ ను అభివృద్ధి చేసి, స్వాతంత్ర దినోత్సవం రోజున కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. పిచ్చి మొక్కలతో, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా , శిథిలావస్థాకు చేరిన అబ్బయ్య రాజు పార్కును స్థానికుల సహకారంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.
పాలకోడేరు స్కూల్ ను కూడా స్వాతంత్ర దినోత్సవ రోజున ప్రారంభించాం. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి మిగతా 15 పాఠశాలలోని అభివృద్ధి చేసిన క్రీడా ప్రాంగణాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉండి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం 50 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గ పరిధిలోని రెండు స్కూళ్లలో మాత్రమే స్థానిక రాజకీయాల కారణంగా ఆలస్యం జరిగిందన్నారు.
వర్షాల కారణంగా మంచినీటి పైప్ లైన్ మరమ్మత్తుల కార్యక్రమం కాసింత ఆలస్యం అయ్యిందని తెలిపారు. ఆగస్టు నెల ఆఖరు నాటికి, సెప్టెంబర్ లోగా ఆకివీడు వరకు అన్ని హ్యాబిటేషన్లకు మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. పక్క నియోజకవర్గ పరిధిలోని మూడు గ్రామాలకు ఇప్పటికే మంచినీటి సరఫరా జరుగుతోందన్నారు.
ఉండి సబ్ కెనాల్ పూర్తిగా మట్టితో కూరుకుపోయిందని, పూడిక తీయడానికి వీలు లేకుండా గట్లపై బడ్డీ కొట్టులు వెలిశాయన్నారు. పాముల పర్రు గ్రామానికి పూర్తిగా కలుషితమైన నీరు సరఫరా అవుతుందని, దీనివల్ల గ్రామస్తులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ గట్లను ఆక్రమించి బడ్డీ కొట్టులను ఏర్పాటు చేసిన వారిని స్వచ్ఛందంగా షాపులను తొలగించాలని సూచించగా 60 శాతం మంది అంగీకరించారు.
మిగిలిన వారు కూడా స్వచ్ఛందంగా బడ్డీ కొట్టులను తొలగిస్తే మంచిది. లేకపోతే వాటిని బలవంతంగా తొలగించాల్సి వస్తుంది. బడ్డీ కొట్టుల వారి కోసం 1500 మంది గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. కెనాల్ ఒక కిలోమీటర్ మేర పూడుకపోయిందని, మూడు రోజుల్లో పూడిక తీత పనులను పూర్తి చేసి, గ్రామస్తులకు మంచినీటిని సరఫరా చేస్తామని తెలిపారు. ఉండి పార్క్ అభివృద్ధి స్ఫూర్తితో కొల్లేరు లోని కాటన్ పార్కును రెండవ దశలో అభివృద్ధి చేస్తామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి అయిన వెంటనే, ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రి వద్దనున్న డంపింగ్ యార్డ్ లో గత 15 రోజుల నుంచి చెత్త వేయడం నిలిపి వేయించినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. డంపింగ్ యార్డ్ ను ఇప్పుడు అక్కడి నుంచి ఎత్తివేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రిలోని నూతన బ్లాక్ సెప్టెంబర్ నాటికి పూర్తిచేసి ఆసుపత్రి సేవలను మరింత విస్తృతపరచనున్నట్లు వెల్లడించారు.
ఉండి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలను కూడా నూతన భవనాలలోకి మార్చడం జరుగుతుందన్నారు. ఇప్పటికే అసంపూర్తిగా మిగిలిన భవనాలను పూర్తి చేసి, ఎమ్మార్వో కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్లను కూడా నూతన భవనాలలోకి మార్చనున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఎన్ ఆర్ జి ఎస్ నిధులతో చేపట్టిన భవనాలు కొన్ని లక్ష, రెండు లక్షల రూపాయలు వెచ్చిస్తే పూర్తవుతాయి. వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నాం. ప్రభుత్వ కార్యాలయాలకు ఏదైనా సమస్యలపై వెళ్లిన వారికి, అక్కడ పని జరుగుతుందని నమ్మకాన్ని కలిగించడానికి మంచి పని చేసే వాతావరణాన్ని నెలకొల్పనున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు.
పాలకోడేరు ఎమ్మార్వో కార్యాలయాన్ని నూతన భవనంలోకి మార్చడం జరిగిందన్నారు. స్థానికంగా రెండు సచివాలయ కేంద్రాలు ఉండగా ఒక కేంద్రంలోనే సిబ్బందిని పూర్తిగా అడ్జస్ట్ చేసి, రెండవ దాన్ని ఎమ్మార్వో కార్యాలయానికి కేటాయించినట్లు తెలిపారు. పాలకోడేరు రోడ్డు కిరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. రోడ్డు కిరువైపులా ఏపుగా ఎదిగే మొక్కలు నాటాలని నిర్ణయించాము .