రావూస్ కళాశాలకు జరిమానా!

– న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ తీర్పు
– తీర్పు వెలువడిన వెంటనే విద్యార్థికి నష్ట పరిహారం అందజేసిన రావూస్

నెల్లూరు, మహానాడు: విద్యార్థి వద్ద పూర్తి ఫీజు వసూలు చేసి అడ్మిషన్ ఇవ్వని రావూస్ కళాశాల యాజమాన్యానికి ఉమ్మడి నెల్లూరు వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ జరిమానా విధించారు. తిరుపతి జిల్లా కురుగొండ గ్రామానికి చెందిన చెముడుగుంట సురేష్ అనే విద్యార్థి నెల్లూరులోని రావూస్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ కోర్సులో చేరాలని నిర్ణయించుకున్నాడు. కళాశాల అడ్మిషన్ టీం విద్యార్థి తల్లిదండ్రుల వద్ద నుండి పూర్తి ఫీజు రూ. 48,300 వసూలు చేశారు. తరువాత విద్యార్థి సురేష్ ను కళాశాలలోకి అనుమతించడానికి కళాశాల యాజమాన్యం నిరాకరించారు.

విద్యార్థి తల్లిదండ్రులు అతన్ని అనుమతించాలని బతిమాలినా కళాశాల యాజమాన్యం వినలేదు. దీంతో కాలేజీ ఫీజు వాపసు చెల్లించాలని కోరినా యాజమాన్యం నిరాకరించడంతో బాధితులు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన న్యాయమూర్తి జింకా రెడ్డి శేఖర్ ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన అడ్మిషన్ లిస్టును న్యాయమూర్తి ముందు ఉంచాలని ఆదేశించారు. అడ్మిషన్ లిస్టులో బాధితుడి పేరు లేకపోవడంతో అడ్మిషన్ ఇవ్వకుండా పూర్తి ఫీజు ఎందుకు వసూలు చేశారని రావూస్ కళాశాల యాజమాన్యంపై మండిపడ్డారు. వసూలు చేసిన ఫీజులో రూ.300 రిజిస్ట్రేషన్ మినహా మిగిలిన రూ.48,000లు 9 శాతం వడ్డీ తో పాటు కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 5 వేలు బాధితుడి తండ్రికి చెల్లించాలని ఆదేశించారు. తీర్పు వెలువడిన వెంటనే బాధితుడికి తీర్పులో పేర్కొన్న డబ్బును కళాశాల యాజమాన్యం వారు చెల్లించారు.