– గతం కంటే మిన్నగా భక్తులకు సౌకర్యాలు కల్పించాం
– ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
– శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మకు చీరసారె సమర్పించిన సీఎం
అమరావతి : ‘తెలుగు రాష్ట్రాలు, దేశంలో ఉన్న దుర్గాదేవి భక్తులకు దసరా శుభాకాంక్షలు. అత్యంత విశిష్టమైన అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టం. దుర్గమ్మపై భక్తిభావం, విశ్వాసంతో రోజూ లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగ చేసుకుంటాం. రాబోయే రోజుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించా’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కనకదుర్గ అమ్మవారికి చీరసారె సమర్పించి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ….తిరుమల శ్రీవారి తరువాత రెండో అతిపెద్ద దేవాలయం విజయవాడ కనకదుర్గమ్మ. దుర్గమ్మను తలచుకున్నా, పూజ చేసినా విజయానికి ఢోకా ఉండదనేది భక్తుల నమ్మకం. దేవాలయాల్లో పవిత్రతను, ఆధ్యాత్మిక స్ఫూర్తిని పెంచే బాధ్యత అందరిపైనా ఉంది.
వినూత్నంగా ఈ ఏడాది సేవా కమిటీ సభ్యులను నియమించి భక్తులకు సేవలు అందించేలా చేశాం. దేవాలయాలకు వచ్చే ప్రతి వ్యక్తి నమ్మకంతో వస్తే జీవితం సార్ధకం అవుతుంది’ అని అన్నారు.
సౌకర్యాలపై భక్తుల సంతృప్తి
‘పాలక మండలి సభ్యులను అభినందిస్తున్నా. నవ రాత్రులు ప్రారంభం నుంచి నేటి దాకా 5,85,651 మంది భక్తులు దర్శించుకున్నారు. నేడు 67,936 మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. భక్తుల కోసం వారం రోజుల్లో 6,96,396 లడ్లు తయారు చేశారు. అన్నప్రసాదం 1.07 లక్షల మందికి పంపిణీ చేశారు. 12.55 లక్షల నీళ్ల ప్యాకెట్లు, 75 వేల పాల ప్యాకెట్లు, 1.23 లక్షల మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు అందించారు. గతం కంటే ఈ సారి ఏర్పాట్లు బాగా చేశారు.
ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయించాం. ప్రతి రోజూ భక్తుల నుంచి అభిప్రాయం కూడా తీసుకున్నాం. దుర్గమ్మ తల్లి దయతో ఈ యేడాది పుష్కలంగా వర్షాలు కురిశాయి. రాబోయే రోజుల్లోనూ వర్షాలు పుష్కలంగా కురిసి, అమరావతి, పోలవరం పనులు వేగంగా జరగాలని కోరుకున్నా. అమ్మవారి అనుగ్రహంతో పేదరికం లేని సమాజం రావాలని వేడుకున్నా.
నేడు మూలా నక్షత్రం సందర్భంగా ఉచిత దర్శనంతో పాటు ఒక లడ్డూను ఉచితంగా భక్తులకు అందించాం. రాబోయే రోజుల్లో ఆలయాలకు ఆదాయం, వీఐపీల కంటే పేదల ప్రజలే ధ్యేయంగా భక్తుల మనోభావాలకు అనుగుణంగా పాలకమండలి నిర్ణయాలు ఉంటాయి. దేవాలయాల సాంప్రదాయాలు, చట్టాలను, ఆనవాయితీలను గౌరవిస్తాం. ప్రతి దేవాలయానికి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తాం.’ అని సీఎం అన్నారు. కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు