నడికుడి, పిడుగురాళ్లలో ఆ రైళ్లు ఆగుతాయి
రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడిన యరపతినేని
పిడుగురాళ్ల, మహానాడు: రైలు బండ్లను మా ఊళ్లలో ఆపండి మహాప్రభో! అంటూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘మహానాడు’ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. దీనిపై గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి, రైళ్లు ఆయా స్టేషన్లలో నిలిచేలా కృషి చేశారు.
వివరాల్లోకి వెళితే… నారాయణద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్స్ లను పల్నాడు జిల్లా, గురజాల నియోజవర్గంలోని నడికుడి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో స్టాపింగ్ ను ఎత్తి వేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని ‘మహానాడు’ పత్రిక కథనం ప్రచురించింది. దీనిపై గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు స్పందించి రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడారు.
గురజాల నియోజకవర్గ ప్రజల అవసరాల దృష్ట్యా, ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని, నడికుడి, పిడుగురాళ్ల స్టేషన్లో ఈ మూడు ట్రైన్లకు స్టాపింగ్ ఇవ్వాలని అధికారులను కోరారు. రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించి, ఈనెల 21 నుంచి యధావిధిగా నడికుడి, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో నారాయణద్రి, విశాఖ, చెన్నై ఎక్స్ ప్రెస్స్ లకు స్టాపింగ్ (నిలిచేందుకు) ఇస్తున్నారని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు.